షర్మిల.. దేవుడి స్క్రిప్ట్ ఇదేనేమో..?

దేవుడి స్క్రిప్ట్ అంటారో.. డెస్టినీ అంటారో.. అచ్చ తెలుగులో తలరాత అంటారో కానీ కొన్ని విషయాలు భలే టర్న్ అవుతాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ టర్నింగ్స్ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదేం జరిగిందంటారా? ఒకటేంటి చాలా జరిగాయి. నిన్న మొన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబే దిక్కన్న మాజీ మంత్రి గొల్లపూడి సూర్యారావుకి.. ఇప్పుడు చంద్రబాబు రాక్షసుడిలా కనిపిస్తున్నారు. పార్టీ మారగానే చూసే ధృక్కోణం మారుతుందో ఏమో కానీ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ఉంటారు. చంద్రబాబేదో తనను అవమానించారని.. చాలా మాటలు వదిలారు. ఇక ఇదిలా ఉండగా.. వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ పంచన చేరి ఆ పార్టీని ఇష్టానుసారంగా దూషించే వారు కూడా ఉన్నారు. 

గెలిస్తే అదృష్టం.. లేకుంటే లేదు..

ఈ మహిమంతా ప్రస్తుతం అయితే టికెట్లలో ఉంది. టికెట్ ఇచ్చినోడు భగవంతుడు.. ఇవ్వని వాడు అసురుడు. ఇది రాజకీయాల్లో సర్వ సాధారణమే. గెలిచే సత్తా ఉందా? లేదా? అనేది తరువాయి. ముందు టికెట్ సాధించుకుని పోటీ చేయాలి. గెలిస్తే అదృష్టం.. లేకుంటే లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇక ఇలాంటి వారంతా ఒక సైడ్. మరికొందరుంటారు. నిన్న మొన్నటి వరకూ ఒకరి తరుఫున వకాల్తా పుచ్చుకుని ఎదుటి పార్టీ అధినేతను ఇష్టానుసారంగా తిట్టి.. తిరిగి ఎవరి తరుఫున అయితే వకాల్తా పుచ్చుకున్నారో వారితో ఘోరంగా అవమానపడి.. చివరకు అన్ని విధాలుగా నష్టపోయి బయటకు వచ్చేవారు. ఏ నోటితే అయితే ప్రతిపక్ష నేతను తిట్టారో అదే నేత తరుఫున వకాల్తా పుచ్చుకుంటారు. వారెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. అవును.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలా రెడ్డి.

ఇంతకు మించి ఇంకేముంటుంది?

అన్నకు చేదోడు వాదోడుగా నిలచి.. అన్న జైలు కెళితే పాదయాత్రలు చేసి.. అధికార పీఠంపై కూర్చోబెట్టే వరకూ షర్మిల విశ్రమించలేదు. చంద్రబాబును, ఆయన తనయుడు నారా లోకేష్‌ను ఆ సమయంలో షర్మిల దారుణాతి దారుణంగా మాట్లాడారు. లోకేష్‌ను పప్పు అంటూ విమర్శలు గుప్పించారు. మొత్తానికి అన్నను అందలమెక్కించారు. అలాంటి షర్మిలకు ఆ తరువాత అధికారంలో స్థానమివ్వలేదు. ఆస్తిలో వాటా ఇవ్వలేదు. నడిరోడ్డున అన్న జగన్ నిలబెట్టేశారు. ఇప్పుడు షర్మిలకు ఎవరేంటనేది తెలిసొచ్చింది. చంద్రబాబుతో కంపేర్ చేసి మరీ జగన్‌ను ఏకి పారేస్తోంది. అన్నా.. అన్నా అంటూనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతోందంటూ జగన్ సైన్యం విమర్శలు గుప్పిస్తున్నా లెక్కచేయడం లేదు. మొత్తానికి షర్మిల అన్నను ప్రశ్నలతోనే లాక్ చేస్తోంది. ఇంతకు మించిన దేవుడి స్క్రిప్ట్ ఇంకేముంటుంది?.

Source link