సినీజోష్ రివ్యూ: పొన్నియిన్ సెల్వన్ 2
బ్యానర్: మద్రాస్ టాకీస్
నటీనటులు: విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, జయరామ్, శరత్ కుమార్, ప్రభు, పార్తీబన్, రెహమాన్, విక్రమ్ ప్రభు తదితరులు
ఆర్ట్: తోట తరణి
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నిర్మాత, దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: 28-04-2023
ఇతర భాషల్లో నిరాశ పరిచినా తమిళ్ లో మాత్రం సంచలన విజయం సాధించింది పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1. విపులంగా చెప్పాల్సిన చారిత్రాత్మక కథ కనుక బాహుబలి స్ఫూర్తితో పొన్నియిన్ సెల్వన్ ని 2 పార్టులుగా ప్లాన్ చేసానని ప్రకటించిన దర్శక దిగ్గజం మణిరత్నం రెండు భాగాలనూ ఒకేసారి చిత్రీకరించేసారు. అందుకే పార్ట్ 1 విడుదలైన ఆరు నెలల్లోనే పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేసుకుంది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి భారీ తారాగణంతో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగమైనా మన తెలుగు ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా ఉందా, ఆదరణ పొందగలదా అనే విశ్లేషణలోకి వెళితే…
PS 2 స్టోరీ రివ్యూ: తొలి భాగంలో చోళ యువరాజు అరుణ్ మొళి వర్మ(జయం రవి), వల్లవరాయన్ వాందిదేవన్ (కార్తీ) శత్రువులతో పోరాడి సముద్రంలో మునిగిపోవడంతో ముగిసిన పొన్నియిన్ సెల్వన్ కథనాన్ని రెండో భాగంలో హృద్యంగా ఆరంభించారు మణిరత్నం. ఆదిత్య కరికాలన్ (విక్రమ్), నందిని (ఐశ్వర్యరాయ్)ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో మొదలయ్యే ఈ చిత్రం ఆపై చిరంజీవి వాయిస్ ఓవర్ తో అసలు కథలోకి వెళుతుంది. అరుణ్ మొళి వర్మకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించే వృద్ధురాలు నందిని పోలికలతో ఎందుకు ఉందనేది కథలోని కీలక అంశం. అలాగే ఆదిత్య కరికాలన్ – నందినిల మధ్య సంఘర్షణ ఈ కథనానికి ప్రధాన బలం. చోళ రాజుల్ని అంతం చేయాలనే పాండ్య సైన్యం ప్రతీకారం, చోళ రాజ్యానికి మధురాంతకుడు (రెహమాన్) పట్టపు రాజు కావాలనే రాజకీయం, ఆదిత్య కరికాలన్ ని అంతం చేయాలనే నందిని వ్యూహం… ఇలా పలు ఆసక్తికర అంశాలతో నిండిన పొన్నియిన్ సెల్వన్ కథను వీలైనంత వివరంగా చూపిస్తూ 9వ శతాబ్దాన్ని తెరపై ఆవిష్కరించారు మణిరత్నం.
PS 2 స్క్రీన్ ప్లే రివ్యూ: ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి ఐదు భాగాలుగా వెలువరించిన చోళుల కాలం నాటి చారిత్రిక గాథను రెండు భాగాల సినిమాగా మలిచే ప్రయత్నంలో మణిరత్నం మాగ్జిమమ్ ఆ రచననే అనుసరించారు. అయితే కార్తీ, జయరామ్ పాత్రల ద్వారా ప్రథమ భాగంలో ప్రేక్షకులకు కాస్త ఆహ్లాదాన్ని పంచిన మణిరత్నం ఈసారి మాత్రం ఆ దిశగా అస్సలు ఆలోచించలేదు. పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు, సాహసాలు, త్యాగాలు వంటి అంశాలన్నిటినీ నాటకీయంగా చూపిస్తూ కథని నడిపించేసారు. ఇక లెక్కకు మిక్కిలి పాత్రలతో, నోరు తిరగని పేర్లతో ఈసారి కూడా మన తెలుగు ప్రేక్షకులకు గందరగోళం తప్పదు. అలాగే ఆదిత్య కరికాలన్ – నందిని యుక్త వయసులో ఎందుకు దూరమయ్యారో, మందాకినికి సుందర చోళుడు చేసిన అన్యాయం ఏమిటో కారణాలు కనిపించవు. యుద్ధ సన్నివేశాలు ఉన్నప్పటికీ బాహుబలి చూసేసిన మనవాళ్ళ కళ్ళకు అవేం పెద్దగా ఆనవు. కానీ ముగింపు దృశ్యాలు మాత్రం కాస్త ఆకట్టుకుంటాయి. (హమ్మయ్య.. అయిపోయిందిలే అనే ఆనందంతో కావచ్చు)
PS 2 టీమ్ ఎఫర్ట్స్: పొన్నియిన్ సెల్వన్ ప్రథమ భాగంలో చాలా చలాకీగా కనిపించి కార్తీ ఎక్కువ మార్కులు కొట్టేస్తే ఈసారి ఆ అవకాశం విక్రమ్ – ఐశ్వర్యరాయ్ లకు దక్కింది. ముఖ్యంగా ద్విపాత్రాభినయంతో ఐశ్వర్యరాయ్ అదరగొట్టింది. విక్రమ్ తనలోని నటనా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. కార్తీ – జయం రవి పాత్రోచితంగా, పద్దతిగా నటిస్తే త్రిష తన అందం ఏమాత్రం తగ్గలేదని చాటుకుంది. ఇక ఇతర నటీనటులందరూ కూడా నిష్ణాతులే. పాత్రలకు ప్రాణం పోయగల సమర్థులే.! ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన పాటలు జస్ట్ పర్లేదు అనిపించేలా ఉన్నప్పటికీ నేపథ్య సంగీతం మాత్రం నెక్సెట్ లెవెల్ లో ఉందనిపిస్తుంది. కళా దర్శకుడు తోట తరణి ప్రతిభ తొమ్మిదవ శతాబ్దాన్ని ఆవిష్కరిస్తే.. ఛాయాగ్రాహకుడు రవి వర్మన్ అద్భుతమైన దృశ్యాలతో పొన్నియిన్ సెల్వన్ కి సెల్యులాయిడ్ పొయెట్రీ స్టేటస్ తెచ్చారు. పోరాట దృశ్యాలు రెగ్యులర్ వార్ ఎపిసోడ్స్ లానే అనిపిస్తోంటే అవి ఆడియన్సుని మరీ విసిగించకుండా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హెల్ప్ చేసింది. పొన్నియిన్ సెల్వన్ గాథను సినిమాగా మలచాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకున్న మణిరత్నం ఈ కథకు దృశ్య రూపం ఇవ్వడంలో దర్శకుడిగా మరోసారి ఆయన సమర్థతను నిరూపించుకున్నారు.
PS 2 ప్లస్ పాయింట్స్:
- నటీనటులు
- నేపథ్య సంగీతం
- కళ – ఛాయాగ్రహణం
- దర్శకత్వం
PS 2 మైనస్ పాయింట్స్:
- నిదానంగా సాగే కథనం
- మచ్చుకైనా లేని వినోదం
- తెలియని పాత్రల గందరగోళం
PS 2 ఎనాలసిస్: నిజానికి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 కోసం తమిళ తంబీలు ఎదురు చూసిన దాంట్లో పదో వంతు ఆసక్తి కూడా పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు లేదనేది నేటి ఓపెనింగ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. సినిమా యూనిట్ ఎన్ని చోట్లకు తిరిగినా, ఎంతగా ప్రమోట్ చేసినా అర్ధం కాని పాత్రల ప్రహసనంగా ముద్ర వేయించుకున్న పొన్నియిన్ సెల్వన్ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైందనే చెప్పాలి. తమిళనాట బెటర్ రిజల్ట్ రావొచ్చేమో కానీ మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చోళుల కథ కంగాళీగానే కనిపిస్తుంది. విజువల్ గా ఎంత బావున్నప్పటికీ విషయం అర్ధం అయితేనే కదండీ వీక్షకులు ఆస్వాదించగలిగేది.!
పంచ్ లైన్ : PS 2 – ఓపికుంటే చూడొచ్చు ఓటీటీలో.!
సినీజోష్ రేటింగ్: 2.5/5