టిప్పర్ లారీ.. సైకిల్‌ను ఢీ కొడితే!
టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్‌ను ఢీ కొడితే ఎలా ఉంటుందో తెలుసా..? అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా.. నాలుగైదు రోజులుగా మార్మోగుతోంది. మీమ్స్‌గా, పంచ్ డైలాగ్స్ కోసం ఇలా ఒకటా రెండా బాబోయ్ తెగ వాడేస్తున్నారు. ఈ డైలాగ్‌ను ఫేమస్ చేసింది మరెవరో కాదండోయ్.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంతకీ ఏం జరిగింది..? బాబు నోట ఈ మాట ఎందుకొచ్చిందంటే.. ఈ స్పెషల్ స్టోరీ చదివేయాల్సిందే మరి.. ఇక ఆలస్యమెందుకు వచ్చేయండి.. చదివేయండి.. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పేయండి..!
ఇదీ అసలు కథ..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చంద్రబాబుకు డూ ఆర్ డై అన్న అందరికీ.. ఆయనకూ తెలుసు. ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ బాబు మాత్రం అబ్బే అస్సలు ఆలోచించకుండానే మాట్లాడేస్తు్న్నారు.. ఏ పనైనా చేసేస్తున్నారు. ఇదిగో.. తూపాకి తూటా.. మనిషి మాట పెదవి దాటొస్తే ఎంత నష్టం చేకూరుస్తాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది జరిగే ఉంటుంది. ఇక రాజకీయాల్లో ఇలా జరిగితే.. ఆ మాట చేసే నష్టం ఊహకు కూడా అందదు. చంద్రబాబు మాట్లాడిన.. టిప్పర్ డ్రైవర్‌కు జగన్ టికెట్ ఇచ్చాడు.. శభాష్ జగన్ మెచ్చుకుంటున్నా.. అని ఒక్క మాట అన్నారంతే. ఇది ఎంతవరకూ ఆలోచించి అన్నారో తెలియదు కానీ.. ఈ మాటే తూటా అయ్యి రివర్స్ అయ్యింది. బాబుకు జరగాల్సిన నష్టం జరిగిపోగా.. అదిగో ప్రత్యర్థికి మాత్రం కావాల్సిన దానికి మించి ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది.
టిప్పర్, సైకిల్.. ఔర్ బాబు!
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమలలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గురించి మాట్లాడుతూ ఆయన వృత్తిని ఒకింత కించపరుస్తున్నట్లుగానే బాబు మాట్లాడరని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిప్పర్ లారీ డ్రైవర్‌కు టికెట్ ఇచ్చారంటూ ఒకటికి రెండుసార్లు చంద్రబాబు ప్రస్తావించారు. అయితే.. ఎందుకు ఈ మాటన్నారనేది సరిగ్గా చెప్పుకోలేకపోయారు. కానీ.. దీంతో ఒక్కసారిగా శింగనమల నుంచి సోషల్ మీడియా చేరుకున్న డైలాగ్ ఓ రేంజ్‌లో మోతెక్కింది. ఈ మాట ఆయన్ను కించపరుస్తూ అన్నారో.. లేకుంటే జగన్‌ను మెచ్చుకుంటూ అన్నారో తెలియట్లేదు కానీ.. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఏంటి టిప్పర్ డ్రైవర్ రాజకీయాల్లోకి రాకూడదా..? ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా..? అసలు డ్రైవర్ అసెంబ్లీలోకి రాకూడదా.. మీ పక్కనే కూర్చోకూడదా..? అంటూ బాబుపై సామాన్యులు, నెటిజన్లు ఓ రేంజ్‌లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు శింగనమల రిజర్వ్డ్ స్థానం కావడంతో ఇక కులం పేరు తీసి మరీ తిట్టేస్తున్నారు.
నెత్తిన పాలుపోసినట్టే..!
అభ్యర్థుల ఎంపికలో వైఎస్ జగన్ తన మార్క్ చూపిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. భారీగా మార్పులు చేర్పులు సైతం చేయడం జరిగింది. ఇందులో శింగనమల కూడా ఒకటి.. మహిళా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని సామాన్య కార్యకర్త, వీరాభిమాని అయిన వీరాంజనేయులకు జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అసలు ఆయనకు సపోర్టు చేయమనే స్థాయికి గొడవలు వెళ్లాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు మండలాలు వ్యతిరేకించాయి. చంద్రబాబు చేసిన ఈ కామెంట్‌తో కులం, మతం.. వర్గం అనే తేడా లేకుండా అందరూ ఒక్కటయ్యారు. రాజకీయాలకు కొత్త… గెలుస్తారో లేదో అనే స్థాయి నుంచి మెజార్టీని లెక్కేస్తున్న పరిస్థితి. చూశారుగా.. చంద్రబాబు చేసిన కామెంట్స్ ఎక్కడ్నుంచి ఎక్కడి వరకూ వచ్చాయో. సో.. వీరాంజనేయులును దగ్గరుండి చంద్రబాబు గెలిపించబోతున్నారన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే టిప్పర్ డ్రైవర్ నెత్తిన బాబు పాలు పోశారని చెప్పుకోవచ్చు. మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు మాట్లాడితే మంచిది సుమీ.. లేకుంటే సీన్ రివర్స్ అయిపోద్ది..!