1000 years old surya ritual -suraj kund mela

Surajkund Mela 2025 Date:  మనదేశంలో సూర్యుడి ఆరాధన ఇప్పటిది కాదు. చాలా ప్రాచీన కాలం నుంచే ఉంది.  ఋగ్వేదకాలం నుంచే సూర్య భగవానుడి ఆరాధన మన దేశంలో ఉంది. ప్రత్యక్ష నారాయణడిగా పిలుచుకునే సూర్యుడిని ఆరాధించిన రాజవంశాలు ఎన్నో చరిత్రలో ఉన్నాయి. రా, అటెన్ పేరుతో ఈజిప్ట్ రాజులు , హెల్లొస్ పేరుతో గ్రీకులు, సోల్ ఇన్విక్టస్ పేరుతో రోమన్ లు పూజించింది ఆ సూర్యభగవానుడినే. మన దేశంలోని రాజపుత్రులు ‘సూరజ్ ‘ పేరుతో ఆరాధించేవారు. ఇప్పటికీ నార్త్ ఇండియాలో సూర్యుడికి ఇదే పేరు ఉంది. రాజపుత్రులు అంతటితో ఆగలేదు.. సూర్యుడి ఆరాధన కోసం ప్రత్యేకంగా తమ రాజ్యంలోని ఒక్కొక్క ప్రాంతంలో  కృత్రిమ నీటి రిజర్వాయర్లను తవ్వించి  ఏటా అక్కడ  సూర్యుడిని ఆరాధించడం కోసం మేళాలు జరిపేవారు. ఉదయిస్తున్న సూర్యుడి ఆకారంలో తవ్వించిన  ఈ రిజర్వాయర్లను ( పెద్ద సరస్సులు ) ‘సూరజ్ కుండ్ ‘అని పిలిచేవారు. ‘సూరజ్ ‘ అంటే సూర్యుడు, “కుండ్ ” అంటే సరస్సు.  అలాంటి వాటిలో ప్రాచీనమైనది  ఢిల్లీ సమీపంలో ఉంది.

 ఢిల్లీ కి 8కిమీ దూరం లో “సూరజ్ కుండ్ “

దేశ రాజధాని ఢిల్లీకి  8 కిలోమీటర్ల దూరంలో  హర్యానా సమీపంలో ” సూరజ్ కుండ్”  ఉంది. ఢిల్లీని వెయ్యేళ్ల  క్రితం పరిపాలించిన ‘తోమార రాజపుత్రులు ‘ సూర్యుడి ఆరాధకులు. వారిలో ‘అనంగపాల ‘ (1051CE -1081CE ) కుమారుడు ‘సూరజ్ పాల ‘ అరావళి పర్వతాల సమీపంలో సూరజ్ కుండ్ ను తవ్వించాడు.  ఏటా రథసప్తమి రోజుల్లో ఈ సరస్సు వద్ద భారీ హస్తకళల ప్రదర్శన జరుగుతుండేది. సూర్యుడి ఆరాధనతో పాటు  కళారూపాల ప్రదర్శన కోసం ఒక ‘యాంపీ థియేటర్ ‘ ను కూడా ఏర్పాటు చేశారు.  ఏటా అక్కడ కళారూపాల ప్రదర్శనలు, సూర్యుడి ఆరాధన కొనసాగేది.ఆ ఆచారం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అప్పట్లో ఇక్కడ ఒక సూర్య దేవాలయం కూడా ఉండేదని చెబుతుంటారు. ప్రస్తుతం ప్రతి ఏటా  దేశంలోని ఒక్కో రాష్ట్రం ఫిబ్రవరి 1నుంచి 15 వరకూ ఇక్కడ మేళాలు నిర్వహిస్తూ ఉంటాయి. దీనినే ‘సూరజ్ కుండ్ మేళా’ అని పిలుస్తూ ఉంటారు. 2015 లో జరిగిన సూరజ్ కుండ్ మేళాకు ఏకంగా 12 లక్షల మంది పర్యాటకులు హాజరైతే వారిలో 1,60,000  మంది విదేశీయులు కావడం విశేషం. ఆ ఏడాది సూరజ్ కుండ్ మేళాలో చైనా కూడా పాల్గొంది. మామూలు రోజుల్లో ఆ ప్రాంతం నిర్మానుష్యం గా ఉంటుంది. దానితో ఇక్కడ చిరుత పులులు,నెమళ్లు  పొందడానికి వీలుగా చిరుతపులి కారిడార్ గా  ప్రకటించారు.

Also Read: రథ సప్తమి పూజా సులువుగా చేసుకునే విధానం.. పాలు పొంగించాల్సిన సమయం ఇదిగో!

దేశంలోని ఇతర “సూరజ్ కుండ్ ” లు 

ఇలాంటి సరస్సులు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కోటలో ఒక సూరజ్ కుండ్ ఉంది. ఇది కూడా సూర్యుడి ఆరాధన కోసం కట్టిందే. ఝార్ఖండ్ లో అయితే సహజ సిద్ధంగా ఏర్పడ్డ కొన్ని వేడినీటి చలమలు (Hot Springs ) ఉన్నాయి. వీటిని సూరజ్ కుండ్, బ్రహ్మ కుండ్, రామ్ కుండ్, సీతా కుండ్, లక్ష్మణ్ కుండ్ అని స్థానికులు పిలుస్తూ ఉంటారు. కాకపోతే వీటిలో సల్ఫర్ శాతం అధికంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా పురాతన కాలం నుంచి భారతదేశంలో కొనసాగుతూ వస్తున్న సూర్యుడి ఆరాధనకు ప్రత్యక్ష సాక్ష్యాలే ఈ ‘సూరజ్ కుండ్ ‘ సరస్సులు అని చరిత్రకారులు చెబుతుంటారు.

మరిన్ని చూడండి

Source link