Yogini Temple Parliament House: ఈమధ్య కొత్త భారత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు కానీ ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనం హుందా తనమే వేరు. ప్రపంచంలోనే అత్యంత అందమైన పార్లమెంటు భవనాల్లో భారతదేశ పార్లమెంట్ బిల్డింగ్ కూడా ఒకటి. అయితే దీన్ని నిర్మించిన బ్రిటిష్ ఆర్కిటెక్ట్ లుటియెన్స్ మన దేశంలోనే ఉన్న ఒక పురాతన ఆలయాన్ని చూసి స్ఫూర్తి పొందాడని దాన్ని చూసే పార్లమెంట్ భవనం డిజైన్ చేశాడనేది చరిత్రకారుల్లో చాలా కాలంగా జరుగుతున్న చర్చ. ఆ ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా – యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!
చౌసత్ యోగిని ఆలయం, మోరీనా
హిందీలో చౌసత్ అంటే 64. ఈ పేరుతో వెయ్యేళ్ళ నాటి పురాతన ఆలయం ఒకటి మధ్యప్రదేశ్లోని మొరీనా జిల్లాలో ఉంది. జిల్లాలోని మిథోలి గ్రామం లోని ఒక కొండ పైన ‘ఖచ్చపఘట ‘ రాజపుత్ర వంశానికి చెందిన దేవపాల అనే రాజు (1055-1075) యోగిని ఆలయాన్ని కట్టించాడు. 100 అడుగుల ఎత్తున ఉన్న కొండపై 170 అడుగుల వ్యాసం ఉన్న వృత్తాకార ఆలయంగా ఈ గుడిని నిర్మించాడు దేవపాల. ఈ వృత్తాకారపు ఆలయంలో 64 చాంబర్లు ఉన్నాయి. ఈ 64 చాంబర్లలోనూ పురాతన యోగిని విగ్రహాలు ఉండేవి .వాటి పేరు మీదనే ఈ ఆలయానికి చౌసత్ (64) యోగిని ఆలయంగా పేరు వచ్చింది.
ఆలయం మధ్యలో 65వ విగ్రహంగా పెద్ద దేవి మాత ను నెలకొల్పి పూజించేవారు.ఇక్కడ సూర్యుడి ఆరాధన కూడా జరిగేదని చరిత్ర చెబుతోంది. పైకప్పు లేకుండా పిల్లర్లతో నిర్మించిన ఈ వృత్తాకార ఆలయంలో సూర్యుడు నక్షత్రాల గతులను పరిశీలించే వారట. జ్యోతిష్యం, గణితం వంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడి నుండి పరిశోధించేవారు. ఈ వృత్తాకార నిర్మాణం మధ్యలో ఉన్న గుడికి మాత్రం ఫ్లాట్ గా ఉండే పైకప్పు ఉంటుంది. ఒకప్పుడు యోగినీదేవి ఉండే ఈ గర్భాలయంలో ప్రస్తుతం శివునికి పూజలు జరుపుతున్నారు.
మధ్య యుగాల్లో శైవం బలపడ్డాక యోగీనీ విగ్రహాల స్థానంలో శివలింగాన్ని ఉంచి పూజించడం మొదలు పెట్టారు. దక్షిణాదిలో పెద్దగా పాపులర్ కాని ఈ ఆలయ నిర్మాణ శైలి చూడడానికి రెండు కళ్ళు చాలవు. దేశం మొత్తం మీద చౌసత్ యోగీనీ ఆలయాలు 5 ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్వాత కాలంలో శివాలయాలుగా మారాయి. కాబట్టి అసలు ఈ యోగినులు ఎవరు అనే దానిపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యోగినులను పూజించే ప్రత్యేకమైన మతం ఏదైనా భారతదేశంలో ఉండేదా, లేక ఇదంతా శైవం లో భాగమా అనేదానిపై అనే దానిపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.
Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది – రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
భారత పార్లమెంట్ భవనానికి స్ఫూర్తి?
చరిత్ర కారుల్లో జరిగే చర్చ ఏంటంటే భారత పాత పార్లమెంటు భవనానికి ఈ చౌసత్ యోగినీ ఆలయమే స్ఫూర్తినిచ్చిందని. అయితే పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన ఎడ్విన్ లుటియెన్స్ ఆ విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి 1911 లో మార్చినప్పుడు పరిపాలనకు ఒక భవనం కావాల్సి వచ్చింది. వైశ్రాయ్ ఆదేశాల మేరకు ఆర్కిటెక్టులు ఎడ్విన్ లుటియెన్స్, హెర్బర్ట్ బేకర్ లు పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు. 1921 లో కట్టడం ప్రారంభిస్తే 6ఏళ్ల తర్వాత 1927 లో భవనం పూర్తయింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. స్వతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పడ్డాక భారత పార్లమెంట్ గా ఈ భవనం కొనసాగింది. ఇండియన్ సంప్రదాయ భవన నిర్మాణ శైలితో పాటు ప్రాచీన గ్రీస్, రోమన్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ కలిపి ఈ భవనాన్ని నిర్మించారు. 144 స్తంభాలతో వృత్తాకారంలో ఉండే ఈ భవనాన్ని చూస్తే చౌసత్ యోగిని టెంపుల్ గుర్తుకు రావడం ఖాయం. 2023 లో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాక పాత భవనాన్ని సాంస్కృతిక వారసత్వ సంపదగా సంరక్షించే పనుల్లో భారత ప్రభుత్వం ఉంది
మరిన్ని చూడండి