Holi Tragedy: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం జరిగింది. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న ఓ కుర్రాడికి హోలీ రంగులు పూసేందుకు ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. దానికి అతను నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి చంపేశారు.
బుధవారం సాయంత్రం రాల్వాస్ గ్రామంలో అశోక్, బబ్లు, మరియు కలురామ్ హోలీ పండగ చేసుకున్నారు. అందరికీ రంగులు పూస్తూ వెళ్తారు. స్థానిక లైబ్రరీకి కూడా వెళ్లారు. అక్కడ పోటీ పరీక్షల కోసం చదువుకుంటున్న హన్స్‌రాజ్ అనే వ్యక్తికి కూడా రంగులు పూసేందుకు యత్నించారు.
ఆ ముగ్గురు చేసిన ప్రయత్నాన్ని హన్స్‌రాజ్ అడ్డుకున్నాడు. రంగులు వేయొద్దని వారికి చెప్పాడు. దీంతో కోపంతో ఆ ముగ్గురూ అతన్ని తన్ని, బెల్టుతో చితక్కొట్టారు. అప్పటికీ ఆగ్రహం చల్లారలేదో ఏమో కానీ ఆ గ్యాంగ్‌లో ఒకడు హన్స్‌రాజ్ గొంతుకోసి చంపేశాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) దినేష్ అగర్వాల్ తెలిపారు.
హన్స్‌రాజ్ మరణ వార్త సంచలనంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఉదయం వరకు రోడ్డుపై బైఠాయించారు.
డెడ్‌బాడీతో జాతీయరహదారిపై కుటుంబ సభ్యులు ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారితో మాట్లాడి ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. తమకు న్యాయం చేయాలని బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుటుంబానికి యాభై లక్షల పరిహారం ఇవ్వాలని, ఒక ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలని కూడా పట్టుబట్టారు. రాత్రి నుంచి ఉదయం వరకు హన్స్‌రాజ్ కుటుంబంతో మాట్లాడిన పోలీసులు చివరకు ఒప్పించారు.
మరిన్ని చూడండి