IND vs WI 2nd Test Day 2 – Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకంతో చెలరేగాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‍తో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన నేడు (జూలై 21) సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో 500వ అంతర్జాతీయ మ్యాచ్‍లో శతకం సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా తన కెరీర్‌లో 29వ టెస్టు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ. మొత్తంగా తన 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్‍లో 76వ అంతర్జాతీయ శతకాన్ని (వన్డేల్లో 46, టీ20ల్లో ఒకటి) నమోదు చేశాడు. వెస్టిండీస్‍తో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇప్పటి వరకు 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (182 బంతుల్లో 102 పరుగులు నాటౌట్), రవీంద్ర జడేజా (106 బంతుల్లో 50 పరుగులు నాటౌట్) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. జడేజా కూడా అర్ధ శకతం పూర్తి చేశాడు. నేడు ఇంకా 82 ఓవర్ల ఆట మిగిలి ఉంది. భారీ స్కోరు దిశగా భారత్ ముందుకు సాగుతోంది.