55th GST Council Meeting increased gst on sale of used cars including evs and popcorn | GST: సెకండ్‌ హ్యాండ్‌ కార్లు మరింత కాస్ట్‌లీ, పాప్‌కార్న్‌ తిన్నా మోత మోగిపోద్ది

55th GST Council Meeting Decesions: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Nirmala Sitharaman) అధ్యక్షతన, 55వ వస్తు సేవల పన్ను మండలి (GST Council meeting) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. AAC బ్లాక్‌లు, బలవర్ధకమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), ఫ్లేవర్డ్ పాప్‌కార్న్ వంటివాటిపై మొదట నిర్ణయాలు వెలువడ్డాయి.

50% కంటే ఎక్కువ ఫ్లై యాష్ కంటెంట్ ఉన్న ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్‌లపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (EVs) సహా పాత & ఉపయోగించిన కార్ల విక్రయాలపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడానికి కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. 

విటమిన్లు, మినరల్స్‌ యాడ్‌ చేసిన బలవర్ధకమైన బియ్యం (Fortified rice)పై పన్ను రేటును 5 శాతానికి తగ్గించారు. తుది వినియోగంతో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెడీ-టు-ఈట్ పాప్‌కార్న్‌పై పన్నును కూడా GST కౌన్సిల్ సవరించింది. నాన్‌కీన్‌ల తరహాలో ఉప్పు, మసాలాలు కలిపిన పాప్‌కార్న్‌ను ప్యాకింగ్‌ & లేబుల్ లేకుండా సరఫరా చేస్తే 5 శాతం GST చెల్లించాలి. అదే ఫుడ్‌ను ప్యాక్ చేసి లేబుల్‌తో సరఫరా చేస్తే 12 శాతం GST కట్టాలి. పంచదారతో కలిపిన పాప్‌కార్న్, కారామెల్ పాప్‌కార్న్‌లో ఉపయోగించే చక్కెర వల్ల ఈ రకాలను మిఠాయి కిందకు తీసుకువచ్చారు, 18 శాతం GST విధించారు.

స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై పన్ను భారం తగ్గించారు, దీనివల్ల ప్రజలకు మరింత తక్కువ ధరలో ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం GSTని (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో కూడిన) 5 శాతానికి (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లేకుండా) తగ్గించేందుకు ఫిట్‌మెంట్‌ కమిటీ ప్రతిపాదించింది. దీనిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.

బీమాపై నిర్ణయం మళ్లీ వాయిదా
దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న ‘బీమాపై పన్ను రేటు తగ్గింపు’ అంశాన్ని కౌన్సిల్‌ మరోమారు వాయిదా వేసింది, ప్రజలను నిరాశకు గురి చేసింది. ఈ అంశంపై మంత్రుల బృందం (GoM) భేటీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో తదుపరి పరిశీలన కోసం బీమా అంశాలపై నిర్ణయాన్ని కౌన్సిల్‌ పోస్ట్‌పోన్‌ చేసింది. వాస్తవానికి, టర్మ్‌ పాలసీలు సహా వయోజనలు తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలపై టాక్స్‌ను రద్దు చేసేందుకు GoM ఓకే చెప్పింది. సాధారణ ప్రజలు తీసుకునే రూ.5 లక్షల లోపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపైనా జీఎస్టీని రద్దు చేయాలని, రూ.5 లక్షలు దాటిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై కౌన్సిల్‌ మీటింగ్‌ ప్రారంభంలోనే చర్చ జరిగినప్పటికీ, మరింత లోతైన చర్చ కోసం వాయిదా వేసింది.

GST కౌన్సిల్ ఎజెండాలోని ఇతర అంశాలు
— చేతి గడియారాలు, పెన్నులు, బూట్లు, దుస్తులు వంటి విలాసవంతమైన వస్తువులపై టాక్స్‌ పెంపు సహా 148 వస్తువులపై పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు
— ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్న GST శ్లాబ్‌లతో పాటు 35 శాతం టాక్స్‌ స్లాబ్‌ను కూడా ప్రవేశపెట్టడం, హానికర ఉత్పత్తులకు  35 శాతం టాక్స్‌ స్లాబ్‌ను వర్తింపజేయడం
— కూల్‌డ్రింక్స్‌తో పాటు దుస్తులపైనా పన్ను రేట్లలో మార్పులు చేసే ప్రతిపాదన కౌన్సిల్‌ దగ్గర ఉంది. రూ.1500 వరకు ఉండే రెడీమేడ్‌ దుస్తులపై 5%, రూ.1500- 10,000 విలువైన దుస్తులపై 18%, రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న దుస్తులపై 28% జీఎస్‌టీ విధించాలని ప్రతిపాదన

మరో ఆసక్తికర కథనం: వ్యవ’సాయం’ చేస్తాం, దేశానికి తిండి పెడతాం – తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య 

మరిన్ని చూడండి

Source link