SAFF Championship – Team India: సౌత్ ఏషియన్ ఫుట్‍బాల్ ఫెడరేషన్ (SAFF) చాంపియన్‍షిప్ టోర్నీలో భారత ఫుట్‍బాల్ టీమ్ మరోసారి సత్తాచాటింది. నేడు (జూలై 1) లెబనాన్‍తో జరిగిన సెమీఫైనల్‍లో పెనాల్టీ షూటౌట్ ద్వారా టీమిండియా 4-2తో విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరికి పెనాల్టీ షూటౌట్‍లో భారత్ గెలిచింది. పెనాల్టీ షూటౌట్‍లో భారత్ తరఫున కెప్టెన్ సునీల్ ఛెత్రీ, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్.. బంతిని గోల్ పోస్టులోకి కొట్టి గోల్స్ చేశారు. లెబనాన్ నాలుగు ప్రయత్నాల్లో రెండుగోల్స్ మాత్రమే చేయగలిగింది. అంతకు ముందు రెండు జట్లు మ్యాచ్ సమయంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో (0-0) పెనాల్టీ షూటౌట్ అవసరమైంది. ఈ షూటౌట్‍లో భారత్ గెలిచింది. ఇక ఎస్ఏఎఫ్ఎఫ్ ఫైనల్‍లో జూలై 4న కువైట్‍తో టైటిల్ కోసం పోరాడనుంది భారత జట్టు.