ప్రాజెక్టుల పురోగతిపై సీఎం జగన్ ఆరా
ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించాలన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల ప్రగతిని సీఎంకు అధికారులు నివేదించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తికావొచ్చిదని, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. అవుకు ద్వారా 20 వేల క్యూసెక్కుల కృష్ణా వరదజలాలను రాయలసీమకు తరలించవచ్చని తెలిపారు. వరదలు సమయంలో నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కరవు ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండో టన్నెల్ పనులు కూడా కొలిక్కివస్తున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు స్పష్టంచేశారు.