Kadiyam Vs Rajaiah : ఆ ఇద్దరూ బీఆర్ఎస్ నేతలే అయినా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు తరచూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అధిష్ఠానం హెచ్చరించినా… వారి తీరు మారడంలేదు. వారే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. మంత్రిగా ఉన్నప్పుడు కడియం అవినీతి చేశారని ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజయ్య వైద్యుడే అయినా సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన తల్లి కులం, తన కులం గురించి మాట్లాడడం దారుణమన్నారు. పిల్లలకు తండ్రి కులమే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తల్లి మాత్రమే సత్యం, తండ్రి అపోహా అని రాజయ్య దారుణంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలకు ఆయన ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని రాజయ్యకు సవాల్ చేశారు.