రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి, రైతులకు వద్దా?- దాసోజు శ్రవణ్-hyderabad brs leader dasoju sravan criticizes revanth reddy on free electricity comments

Dasoju Sravan : ఉచిత కరెంట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్ ఛార్జ్ దాసోజు శ్రవణ్‌ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ వ్యాఖ్యలపై ఘాటు విమ‌ర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌ రైతులకు అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్, టీడీపీ పాల‌న‌లో క‌రెంట్ లేక రైతులు అరిగోస ప‌డ్డార‌ని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. మొద‌టి నుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపు అన్నారు. మొన్న ధ‌ర‌ణి రద్దు చేస్తామన్నారని, ఇప్పుడు వ్యవ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌రిపోతుంద‌ని రేవంత్ అంటున్నారని… దీనిని బట్టి కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పేరుకు మాత్రమే రేవంత్ కాంగ్రెస్ మనిషినని , చేసిందంతా చంద్రబాబు కనుసైగలోనేనని శ్రవణ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను తెలుగుదేశం కాంగ్రెస్ గా రేవంత్ రెడ్డి మార్చారని ఆరోపించారు.

Source link