Budget 2024 Expectations these are the things that people expect most from the Interim budget 2024

Budget 2024 Expectations: సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ మీద ప్రజలకు కొన్ని అంచనాలు ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించే ఎన్నికల తాయిలాలు ఉంచొచ్చని నమ్ముతున్నారు. ముఖ్యంగా… మహిళలు, రైతులు, గ్రామీణ ప్రజలు, ఉద్యోగులను నిరుత్సాహపరచకుండా.. కొంచమైనా ఖుషీ చేసే తీపికబుర్లను విత్త మంత్రి (FM Nirmala Sitharaman) చెబుతారని జనం ఆశపడుతున్నారు. నేషనల్‌ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూసినా, ఈ మధ్యంతర బడ్జెట్‌లో (Interim budget 2024) నిర్మలమ్మ కొన్ని కానుకలు ప్రకటించే అవకాశం ఉంది.

మధ్యంతర బడ్జెట్‌ నుంచి దేశ ప్రజలు ఎక్కువ ఆశిస్తున్న అంశాలు:

– వ్యవసాయ రంగం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (Pradhan Mantri Kisan Samman Nidhi). దీనిని పీఎం కిసాన్‌ ‍(PM-KISAN) యోజన అని కూడా పిలుస్తున్నారు. భూమి కలిగిన రైతులకు, వ్యవసాయ పెట్టుబడుల కోసం నేరుగా నగదు బదిలీ చేసే పథకం ఇది. ఈ స్కీమ్‌ కింద సంవత్సరానికి 6 వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల, దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ మొత్తాన్ని 9 వేల రూపాయలకు పెంచొచ్చని నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది.

– సాధారణ ప్రజల కల సొంతిల్లు. ఈ కలను నిజం చేసేందుకు.. పట్టణ ప్రాంతాల ప్రజలకు తక్కువ వడ్డీకే గృహ రుణాలు ‍‌(Home Loans) అందించే ఏర్పాటు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఎం ఆవాస్‌ యోజన (Pradhan Mantri Awas Yojana) తరహాలోనే ఒక కొత్త పథకాన్ని ఫిబ్రవరి 01న నిర్మలమ్మ ప్రకటించవచ్చని ప్రజలు అంచనా వేస్తున్నారు. 

– బడ్జెట్‌ ప్రసంగాన్ని ఒళ్లంతా చెవులు చేసుకునే వినే ఒక వర్గం ఉంది. అది వేతన జీవుల వర్గం. 2023-24 బడ్జెట్‌లో, టాక్స్‌ రిబేట్‌ను ‍‌(Income Tax Rebate) రూ.7 లక్షలకు పెంచారు. ఈసారి దీనిని రూ.8 లక్షలు చేస్తారని, ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న ప్రామాణిక తగ్గింపును (Standard Deduction) రూ.లక్షకు పెంచుతారని ఉద్యోగులు లెక్కలు వేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని.. పాత పన్ను విధానంలో రూ.5 లక్షలుగా ఉన్న టాక్స్‌ రిబేట్‌ను కూడా పెంచాలని కోరుకుంటున్నారు.

– ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి (Section 80C) కింద, ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ‍‌(Tax Exemption) లభిస్తోంది. అయితే…  పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చెల్లింపులు, ట్యూషన్‌ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, పన్ను ఆదా ఎఫ్‌డీలు సహా ఈ సెక్షన్‌ పరిధిలోకి వచ్చే అంశాల చిట్టా చాలా పెద్దది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.1.5 లక్షల మొత్తం ఏమూలకూ చాలదు కాబట్టి, ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

– గృహ రుణాల తిరిగి చెల్లింపుల మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీనిని సెక్షన్‌ 80సి నుంచి విడదీసి, గృహ రుణాల వడ్డీ చెల్లింపుల తరహాలోనే ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగులు అడుగుతున్నారు.

– బ్యాంక్‌ సేవింగ్‌ అకౌంట్స్‌ మీద వచ్చే వడ్డీ (Interest earned on bank savings accounts) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేలు దాటితే దానిపై ఆదాయ పన్ను చెల్లించాలి. ఈ పరిమితిని రూ.50 వేలకు పెంచుతారని ఆశిస్తున్నారు. 

– దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు ‍‌(Petrol and diesel prices) భగ్గునమండుతున్నాయి. ఈ సెగను చాలా ఏళ్లుగా జనం భరిస్తూనే ఉన్నారు. ఈ రేట్ల వల్ల ద్రవ్యోల్బణం కూడా కొండెక్కి కూర్చుకుంది. అధిక పెట్రో ధరల కారణంగా, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు) భారీ లాభాలను పోగేసుకున్నాయి. OMCలకు వెళ్లే లాభాలను పౌరులవైపు మళ్లించే ఆలోచనలో కేంద్ర ఉన్నట్లు సమాచారం. OMCలతో కొన్ని రౌండ్ల సమావేశాలు కూడా జరిగినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. పెట్రోల్, డీజిల్‌ రేట్లను లీటర్‌కు రూ.10 వరకు తగ్గించవచ్చని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ వాహనాలకు ప్రస్తుతం ఇస్తున్న రాయితీల పొడిగింపుపైనా ఫిబ్రవరి 01న ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. 

హ్యాట్రిక్‌ గోల్‌ పెట్టుకున్న మోదీ ప్రభుత్వానికి, కొత్త సంక్షేమ పథకాల మీద కసరత్తు చేసే సమయం దొరకలేదని, కాబట్టి మధ్యంతర బడ్జెట్‌ మీద ఆశలు పెంచుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. బడ్జెట్‌ మీద అంచనాలు పెట్టుకోవద్దని, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కూడా గతంలో ఒకసారి చెప్పారు.

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌లో ఇవి ఉండకపోవచ్చు, ఆశలు పెట్టుకుని హర్ట్ అవ్వకండి!

మరిన్ని చూడండి

Source link