Tomato Price Hike Skyrocketing Likely To Rise Even More Might Go Up To Rs 300 Per Kg In Weeks

Tomato Price: 

టమాట కష్టాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు! కిలో రూ.150కి చేరుకుంటేనే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాంటిది రాబోయే రోజుల్లో కిలో రూ.300కు చేరుకుంటుందని వ్యవసాయ శాఖా నిపుణులు అంచనా వేస్తున్నారు. అనువైన వాతావరణం లేకపోవడం, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఇందుకు కారణాలని పేర్కొంటున్నారు. వారి మాటలు వింటుంటేనే వినియోగదారులు వణికిపోతున్నారు!

‘టమాట ధరలు మరికొంత కాలం ఇలాగే పెరుగుతాయి. వర్షాల వల్ల కొత్తగా పంటలు వేయడం లేదు. అందుకే రాబోయే వారాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ధరల్లో స్థిరత్వం రావాలంటే కనీసం రెండు నెలల వరకు ఆగాల్సిందే’ అని నేషనల్‌ కమోడిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో సంజయ్‌ గుప్తా అంటున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాట ధరలు (Tomato Prices) కొండెక్కాయి. జూన్‌లో కిలో రూ.40 ఉండగా జులై తొలివారంలో సగటున రూ.100కు చేరుకున్నాయి. మార్కెట్లో సరఫరాను బట్టి ఇప్పుడు రూ.150 వరకు పలుకుతోంది. హిమాచల్‌ ప్రదేశ్ సహా ఉత్తర భారతంలో అధిక వర్షాలతో రాబోయే రోజుల్లో రూ.200కు వెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌, ఒడిశా, వెస్ట్‌ బెంగాల్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, బిహార్‌, తెలంగాణ, ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా, తమిళనాడులో టమాట పంట ఎక్కువగా పండుతుంది. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 91 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. ఉత్తర భారతంలో అధిక వర్షాలు, దక్షిణ భారతంలో పరిమిత వర్షాలతో టమాట పంటపై ప్రభావం పడింది.

‘అనువైన వాతావరణం లేకపోవడం దక్షిణాది రాష్ట్రాలు, కోస్తా ప్రాంతాల్లో టమాట (Tomato Production) ఉత్పత్తిపై పడింది. అధిక వర్షాల వల్ల హిమాచల్‌ ప్రదేశ్‌పై ప్రభావం పడింది. రహదారుల, రవాణాకు అడ్డంకులు కలగడం ఇతర కారణాలు’ అని స్వతంత్ర వ్యవసాయ విధాన విశ్లేషకుడు ఇంద్ర శేఖర్‌ అంటున్నారు. టమాట తక్కువ కాలంలోనే దిగుబడి వస్తుందని, ఎండలు, వైరస్‌లు, చీడపీడల వల్ల విపరీతంగా నష్టపోతుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో రెండు వైరస్‌ల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో దిగుబడి తగ్గిందని వెల్లడించారు. వీటికి ఎండలు, వర్షాలు, గాలులు ఆజ్యం పోశాయన్నారు.

సాధారణంగా టమాట పంట చేతికొచ్చేందుకు 60-90 రోజులు పడుతుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటప్పుడు పంట నష్టం జరుగుతుంది. సరఫరా తగ్గే అవకాశాలు ఉండటంతో ధరల్లో స్థిరత్వం వచ్చేందుకు సమయం పట్టనుంది. సెప్టెంబర్‌ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అక్టోబర్‌ – నవంబర్లో ఉల్లిగడ్డల ధరలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. వర్షాల వల్ల ఉల్లి పంటకు నష్టం వాటిల్లిందని అంటున్నారు. అయితే పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి టమాటా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టింది.

Also Read:  ‘చాట్‌జీపీటీ’కి పోటీగా మస్క్‌ మామ కొత్త కంపెనీ, పేరు xAI

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link