Indian Family Dead in California: అమెరికాలో వరుసగా భారతీయుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దుండగులు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా కుటుంబం అంతా మృతి చెందిన ఘటన మరింత అలజడి సృష్టించింది. కేరళకు చెందిన జంట, వారి ఇద్దరి పిల్లలు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఆ నలుగురూ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ మొదలు పెట్టారు. ఇది హత్యా..? లేదంటే ఆత్మహత్యా..? అన్నది విచారణ తరవాతే తేలనుంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం…కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ, ప్రియాంక బెంజిగర్, వాళ్ల ఇద్దరు కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడం వల్ల పోలీసులు అనుమానించారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. బాత్రూమ్లో సుజిత్, ప్రియాంక డెడ్‌బాడీలు కనిపించాయి. ఇద్దరిపైనా బులెట్ గాయాలున్నాయి. ఇక బెడ్రూమ్లో ఇద్దరి చిన్నారుల మృతదేహాలున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ పిల్లలు ఎలా చనిపోయారన్నది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల వాళ్లకు మత్తు మందు ఇచ్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2016లోనే ఈ జంట విడాకులు తీసుకునేందుకు కోర్టుకి వెళ్లింది. అప్పటి నుంచి ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ గొడవల కారణంగానే వాళ్లిద్దరీ ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే…ఇంట్లో ఎక్కడా సూసైడ్ లెటర్ కనిపించలేదు. దాదాపు 9 ఏళ్లుగా అమెరికాలో ఐటీ ఎంప్లాయ్‌గా పని చేస్తున్నాడు సుజిత్ హెన్రీ.
అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవలే ఓ ఘటన వెలుగులోకి రాగా..ఇప్పుడు మరొకరు హత్యకు గురయ్యారు. ఫిబ్రవరి 2వ తేదీన తెల్లవారుజామున ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన వివేక్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. ఎందుకు అన్నది మాత్రం కారణం తెలియలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి వివేక్‌పై దాడి చేశాడు. తలపై గట్టిగా కొట్టడం వల్ల తీవ్ర గాయాలతో వివేక్ రోడ్డుపైనే పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని పోలీసులు గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు ఐదు రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ప్రాణం దక్కలేదు. తీవ్ర గాయాలతో ఫిబ్రవరి7వ తేదీన మృతి చెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..వివేక్ చందర్ వర్జీనియాలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. అయితే…ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని CCTV ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఓ వ్యక్తిని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. అనుమానితుడి ఫొటో విడుదల చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమకు చెప్పాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Farmers March: ఉద్రిక్తంగా రైతుల ఆందోళనలు, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్న పోలీసులు
మరిన్ని చూడండి