LPG Cylinder Price Hike From March 2024

LPG Cylinder Price Hike From March 2024: మహా శివరాత్రికి ముందు, ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) ప్రజలకు గట్టి షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నెల తొలి రోజు (01 మార్చి 2024) నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రేటును పెంచాయి. ఇప్పుడు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వాణిజ్య సిలిండర్‌పై ఈ రోజు నుంచి 25.50 రూపాయలు భారం పెరిగింది.

ఈ ఏడాది వరుసగా రెండుసార్లు వాత
2024లో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడం ఇది వరుసగా రెండోసారి. ఈ నెలలో మహా శివరాత్రి, హోలీ పండుగలు, సంతాప దినమైన గుడ్‌ఫ్రైడే రానున్న తరుణంలో ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీలు ఈ ధరలు పెంచాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని ఈ నెల 08న, రంగుల పండుగ హోలీని 24-25 తేదీల్లో దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. గుడ్‌ ఫ్రైడే ఈ నెల 29న గుడ్‌ ఫ్రైడే ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో  19 కిలోల LPG సిలిండర్‌ కొత్త ధరలు ఇవి:
రేట్ల పెంపు తర్వాత… దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 25.50 పెరిగింది, రూ. 1,795 కు చేరింది. ఇంతకుముందు రూ.1,769.50 కి లభించేది. ముంబైలో రూ. 1723.50 నుంచి రూ. 1749 కి పెరిగింది. గతంలో ఇది రూ. 1887 గా ఉంది. కోల్‌కతాలో 1911 రూపాయలకు 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ అందుబాటులోకి రానుంది. చెన్నైలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 1937 నుంచి రూ. 1960.50 కు పెరిగింది.

మార్చి నెలకు ముందు, ఫిబ్రవరిలోనూ 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ. 14 మేర OMC లు పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలో, జనవరి నెలలో, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తూతూమంత్రంగా కేవలం రూపాయిన్నర తగ్గించాయి. 

సామాన్యుడికి మళ్లీ మొండిచెయ్యి
గ్యాస్‌ బండ విషయంలో సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఊరట లభించలేదు. 14 కిలోల దేశీయ గ్యాస్‌ సిలిండర్‌ రేటును OMCలు ఈ నెలలో కూడా తగ్గించలేదు. చివరిసారిగా, 2023 ఆగస్టు 30న, డొమొస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను కేంద్ర సవరించింది. అప్పటి నుంచి, ఆరు నెలలుగా రేట్లు తగ్గించకుండా అధిక స్థాయిలోనే కొనసాగిస్తోంది.

ప్రస్తుతం, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర (Domestic LPG Cylinder Price Today) దిల్లీలో రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50, చెన్నైలో రూ. 918.50, హైదరాబాద్‌లో రూ. 955, విజయవాడలో రూ. 944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.

LPG సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి

Source link