గెలుపే లక్ష్యంగా టికెట్లు ఖరారు
ఇదే సమయంలో పార్టీ టికెట్ల పై కొందరు నేతలు హామీలు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై హైకమాండ్ ఫోకస్ చేసింది. కొందరు ముఖ్యనేతలు తామే టికెట్లు ఇప్పిస్తామని చెబుతున్న మాటలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, పార్టీ ముఖ్య నేతలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసింది. వారసులు, అనుచరులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని పార్టీ అధినాయకత్వం వెల్లడించింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపు మాత్రమే లక్ష్యంగా టికెట్ల ఖరారు ఉంటుందని తేల్చేసింది. ముఖ్య నేతలకు మద్దతుగా నిలిస్తే టికెట్లు ఖాయమనే భావనలో ఉన్న నేతలకు హైకమాండ్ నిర్ణయం మింగుడు పడటం లేదు. ప్రజలతో మమేకమైన నేతలకు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పలుమార్లు తెలిపారు. టికెట్ల విషయంలో సిఫార్సులకు అవకాశం లేకుండా.. క్షేత్ర స్థాయి సమాచారం, పార్టీకి పనిచేసిన విధానం, ప్రజల్లో పలుకుబడి, గెలుపునకు అవకాశాలు ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల ఖరారు ఉంటుందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.