Avinash Reddy vs Sharmila అన్న అవినాష్‌తో షర్మిల ఢీ.. అఫిషియల్!

వైఎస్ షర్మిల కడప నుంచే పోటీ ఎందుకు..?

అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో.. తిరిగి అక్కడే దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. అందుకే.. ఏ జిల్లా నుంచి కాంగ్రెస్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పతనం చేశారో అక్కడ్నుంచే తిరిగి బలోపేతం చేసి.. ఓటమి అంటే ఏంటో రుచి చూపించడానికి హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అది కూడా అదే కుటుంబానికి చెందిన వ్యక్తినే ఎంచుకోవడం గమనార్హం. వైఎస్ జగన్‌ను వైఎస్ షర్మిలతోనే అంతు చూడాలని భావించి.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన తర్వాత.. వైసీపీ ప్రస్థానం కడప పార్లమెంట్, పులివెందుల నుంచే ప్రారంభమైందన్న విషయం తెలిసిందే. అందుకే ఇక్కడ్నుంచే జగన్‌ కథేంటో చూడటానికి హస్తం పార్టీ రంగం సిద్ధం చేసింది.

గెలుపెవరిదో..?

కాగా.. కడప పార్లమెంట్‌కు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌పై.. హత్యారోపణలు, అవినీతి.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే ఆరోపణలు కోకొల్లలు. అందుకే.. అవినాష్‌ను ఢీ కొడితే అసలు సిసలైన జగన్‌కు కాంగ్రెస్ సత్తా ఏంటో తెలిసొస్తుందన్నది కాంగ్రెస్ టార్గెట్. సొంత జిల్లానే కాదు 2019 ఎన్నికల్లో చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర జగన్‌ది. అందుకే.. ఓటమి రుచి అన్నది ఎలా ఉంటుందో కడప జిల్లాలోనే చూపించడానికి వైఎస్ షర్మిల ఎన్నికల కదన రంగంలోకి దూకారు. అయితే.. కచ్చితంగా గెలిచి తీరుతానని.. అన్నను ఓడించి తీరుతానని షర్మిల చాలా రోజులు శపథం చేస్తూ వచ్చారు. అనుకున్నట్లుగానే అదే జరిగింది. మరి కడప పార్లమెంట్ ప్రజలు.. షర్మిలను ఆదరిస్తారో.. లేకుంటే అవినాష్‌కు పట్టం కడతారో వేచి చూడాల్సిందే మరి.

మిగిలిన చోట్ల ఇలా..!

ఇక రాజమండ్రి స్థానం నుంచి, గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లం రాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టడం జరిగింది. సోమవారం నాడు కాంగ్రెస్ సీఈసీ కీలక సమావేశం జరిగింది. 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలకు తప్ప మిగిలిన.. అన్ని స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఆమోదించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ సాయంత్రం లోపు అధికారిక ప్రకటన రానుంది.

Source link