Former PM Manmohan Singh retires from Rajya Sabha

Manmohan Singh Retires: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత  మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందారు. ఇవాళ్టితో దాదాపు 54 మంది సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఇందులో మన్మోహన్ కూడా ఉన్నారు. దాదాపు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయన గొప్ప ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయంలో ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 1996 వరకూ పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004-14 వరకూ పదేళ్ల పాటు ఆయనే ప్రధానిగానూ ఉన్నారు. మన్మోహన్ రిటైర్‌మెంట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే X వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మన్మోహన్ సింగ్ రాజకీయ శకం ముగిసిపోయిందంటూనే ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఎప్పటికీ హీరోలానే మిగిలిపోతారని, యువతకి స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ దేశ పౌరులకు ఏ అవసరం వచ్చినా ఆయన తన గొంతుక వినిపిస్తారన్న నమ్మకం ఉందని వెల్లడించారు ఖర్గే. ఆయన ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

“మన్మోహన్ సింగ్ రాజకీయ శకం ఇవాళ్టితో ముగిసిపోతోంది. మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అవసరమైన చోట మీ గొంతకు బలంగా వినిపిస్తారన్న నమ్మకం మాకుంది. మీరు ఎప్పటికీ హీరోనే. యువతకు స్ఫూర్తిగా నిలిచిపోతారు. దేశానికి గొప్ప సేవ చేశానని మీలాగా గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. పారిశ్రామిక వేత్తలకు, బడా వ్యాపారులకు, నిరుపేదలకు మీరు మార్గదర్శిగా నిలిచారు. మీ ఆర్థిక విధానాలతో అందరికీ అండగా నిలిచారు. అన్ని వర్గాల వారికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా పాలసీలు ఎలా రూపొందించవచ్చో మీరు రుజువు చేసి చూపించారు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో 27 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయట పడేసే అవకాశం వచ్చింది. ఈ దేశం మీ సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది”

– మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

 

మరిన్ని చూడండి

Source link