Rahul Gandhi Aircraft Emergency Landing: బెంగళూరులో విపక్ష పార్టీల కీలక భేటీ నేటితో ముగిసింది. ఈ సమావేశాన్ని ముగించుకుని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కొందరు నేతలు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
వాతావరణం సరిగా లేకపోవడంతో భోపాల్‌లోని రాజాభోజ్ విమానాశ్రయంలో వీరు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సైతం ప్రచారం జరుగుతోంది. భోపాల్ ఎయిర్ పోర్ట్ నుంచి మరో విమానంలో సోనియా గాంధీ, రాహుల్ ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం.
The aircraft carrying Congress leaders Sonia Gandhi and Rahul Gandhi makes an emergency landing in MP’s Bhopal due to bad weather, say Bhopal police. pic.twitter.com/4XJVEl7Mq9
— ANI (@ANI) July 18, 2023
బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన విపక్ష కూటమి సమావేశాలు
బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.
ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. రాహుల్ గాంధీ ఈ పేరును ప్రతిపాదించారని.. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పేరును ఖర్గే అధికారికంగా ప్రకటించారు. I – ఇండియా, N – నేషనల్, D – డెమొక్రాటిక్, I – ఇంక్లూజివ్, A – అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు.