A new headache for the alliance! కూటమికి కొత్త తలనొప్పి!

కూటమి గట్టారు..! సీట్లు పంచుకున్నారు..! బీఫామ్‌లు ఇచ్చేశారు.. నామినేషన్లూ వేయించారు..! కొన్ని చోట్ల రెబల్స్ విత్ డ్రా కూడా చేయించారు.. ఇక మిగిలింది మేనిఫెస్టో..

పోలింగ్ మాత్రమే!. అన్నీ సవ్యంగానే సాగుతున్న తరుణంలో కూటమికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కక్కలేక మింగలేక ఉండిపోగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో అయితే తీవ్ర ఆందోళనే చెందుతున్న పరిస్థితి. ఇందుకు కారణం.. గాజు గ్లాస్ గుర్తు జనసేనకు ఇప్పటికే కేటాయించగా ఇప్పుడు ఇండిపెండెంట్లు, రెబల్స్‌కు కూడా ఇదే గుర్తును ఇవ్వడంతో కూటమిని గాజు గ్లాస్ గుచ్చుకున్నట్లయ్యింది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ కావడంతో ఇలా కేటాయింపులు జరిగాయని ఎన్నికల కమిషన్ చెబుతుండగా.. కూటమి నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 

కూటమి కుత.. కుత!

కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. అయితే గత ఎన్నికల్లో రావాల్సిన శాతానికి కన్నా తక్కువ ఓట్లు రావడంతో గ్లాస్ సింబల్ పోయింది. దీంతో ఇప్పుడు ఆ సింబల్ కోసం నానా తిప్పలు పడి మరీ తెచ్చుకుంది. అయితే ఫ్రీ సింబల్ కావడంతో టపీమని వచ్చి పడింది. అయితే.. అదే ఫ్రీ సింబల్‌ను ఇప్పటికే పదుల సంఖ్యలో ఇండిపెండెంట్, రెబల్స్ అభ్యర్థులకు ఇవ్వడంతో కూటమికి పెద్ద తలనొప్పే వచ్చిపడింది. సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే కూటమిని గాజు గ్లాసు గండం వెంటాడుతోంది. నిన్న, మొన్నటి వరకూ గాజు గ్లాసు గుర్తును ఎవరికీ కేటాయించమని చెప్పిన ఈసీ ఇవాళ ఇలా పలువురు అభ్యర్థులకే కేటాయించడం గమనార్హం. అయితే.. మళ్లీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ రెడ్డి అధికారం చేతిలోపెట్టుకుని ఈసీని ఆడిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. జగన్ కుట్రలో భాగమేనని.. ఎలాగైనా సరే కూటమిని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. గ్లాస్ సింబల్‌ సువర్ణాకాశంగా వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కూటమి కుత.. కుత అని ఉడికిపోతోంది.

ఎవరెవరికి ఇచ్చారు?

విజయనగరం మాజీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మీసాల గీతకు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది. మైలవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్‌కుమార్, విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్, టెక్కలిలో స్వతంత్రం అభ్యర్థి అట్టాడ రాజేష్, జగ్గంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర, పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబుకు, గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణకు, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీ చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్‌, మంగళగిరిలో రావు సుబ్రహ్మణ్యం, మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్‌లకు  గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది. చూశారుగా.. ఒకటా రెండా ఇన్నిచోట్ల గ్లాస్ గుర్తు ఇస్తే పరిస్థితేంటి..? ఇంతటితో ఆగదు.. రేపో మాపో మరికొందరు రెబల్స్, ఇండిపెండెంట్లకు ఇదే గుర్తు ఇస్తే జనసేన జెండా ఎత్తేయాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఫైనల్‌గా ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని పవన్ కల్యాణ్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!!

Source link