సైలెంట్ మోడ్ లో తెలంగాణ బీజేపీ-బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీనా?-telangana politics bjp leaders sudden sleep effects on party brs congress mileage going forward

TS Politics : తెలంగాణలో రాజకీయం జెట్ స్పీడ్ లో మారుతోంది. ఇన్నాళ్లు నువ్వా నేనా అంటూ పోటీ పడిన బీజేపీ ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యకు వార్ షిఫ్ట్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలు చెడిన తర్వాత కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ధాన్యం సేకరణతో మొదలైన యుద్ధం కర్ణాటక ఎన్నికల వరకూ కొనసాగింది. కేంద్రం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. దీంతో ఈ పోటీలో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయింది. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో విజయాలతో తెలంగాణలో బీజేపీ బలపడిందన్న సంకేతాలు వచ్చాయి. బీజేపీ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో అంతే స్పీడ్ గా పడిపోయింది. మునుగోడు ఓటమి, అధ్యక్షుడు మార్పుతో బీజేపీ డీలాపడింది. ఎప్పుడూ కాంగ్రెస్ లో కనిపించే అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి పాకాయి. పదవుల కోసం పోటీ పడిన బీజేపీ నేతలు పార్టీని పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ల మాటలు నమ్మిన బీజేపీ అధిష్ఠానం.. పార్టీలో మార్పుచేర్పులు చేసింది. దీంతో మరింత డీలాపడిన ముఖ్యనేతలు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. కీలకనేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.

Source link