INDIA Vs NDA :  బీజేపీ వాళ్లు మొదటి నుంచి ఇండియా అన్న పేరును భారత్ అని ప్రొజెక్టు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇండియా అనే పేరును వెనక్కు తీసుకువెళ్లడానికి వాళ్లకి ఇప్పుడు మరో కారణం దొరికింది. ఇదే I.N.D.IA ఈ ఇండియా వేరు… ఇది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్. బెంగళూరులో 26 పక్షాలు సమావేశం అయ్యి.. తమ అలయెన్స్ పేరు ఇండియా అని మధ్యాహ్నం తర్వాత ప్రకటించగానే.. సాయంత్రానికి 38పార్టీల ఎన్డీఏ సమావేశంలో మోదీ మాట్లాడారు. తన ప్రసంగంలో ఇండియా అనే పేరు రాకుండా చూసుకున్నారు.

ఇండియా కాదు భారత్ అనే పేరుతో పిలిచేందుకు బీజేపీ ఆసక్తి

బీజేపీ సిద్ధాంతం.. RSS మూల సిద్ధాంతంలో నుంచి వచ్చిందే. అఖండ భారత్ భావనను ఎక్కువుగా విశ్వసించే ఆర్ఎస్ఎస్ నేతలు.. ఆర్ఎస్ఎస్ మూలాలు ఎక్కువుగా ఉన్న బీజేపీ నేతలు భారత్ అనే పేరునే ఎక్కువుగా తలుస్తుంటారు. ఇక ప్రతిపక్ష కూటమి.. ఇండియా అనే పేరు ఖాయం చేసుకున్నాక.. ఆ పేరుపై వాళ్లకి మరింత అయిష్టత కలగడంలో ఆశ్చర్యం ఉండదు. మోదీ మంగళవారం ఎన్డీఏ మీటింగ్ లో మాట్లాడిన మాటలు చూస్తే.. అదే అర్థం అవుతుంది. “అబద్ధాలు.. నెగటివిటీ కలసగలిసి ఉన్న పార్టీల కూటమి మనలేదు. ‘భారత్’ లోని నిజమైన పేదలకు సాయం చేసేది.. NDA నే.. “ అంటూ ఆయన మాట్లాడారు. ఈ సారి ఆయన ప్రసంగంలో ఎక్కువుగా భారత్ ను ఇతర దేశాలు విశ్వసిస్తున్నాయని చెప్పారు. NDA తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉండబట్టే… యుకె, యుఎస్, కెనడా,ఫ్రాన్స్ దేశాలు భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాయని.. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉన్నా.. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

భారత్ - ఇండియా భావనపై ఆధిపత్యం కోసమేనా?

భారత్ అనే పేరును, జాతీయత అనే ఫిలింగుపై బీజేపీకి గుత్తాధిపత్యం ఉంది. బీజేపీ ఉన్నదే జాతీయత భావాన్ని పెంపొందించడానికి.. జాతీయ సమగ్రతను కాపాడటానికి.. భారత్ అనే పేరును కాపాడటానికి అన్న విషయాన్ని బలంగా చాటి చెప్పుకోగలగింది. పరిస్థితుల ప్రభావం వల్లనైతే కానీ.. ఆయా పార్టీల వైఖరి వల్లనైతే కానీ ..ఎన్డీయేతర పక్షాల అనివార్యంగా ఈ భావనకు దూరం జరగాల్సిన పరిస్థితి వచ్చింది. మత రాజకీయాలు, సెక్యులర్ విషయాలకు గొడవ తలెత్తిన ప్రతీసారి సూడో సెక్యులరిస్టులు.. జాతి వ్యతిరేకులు.. అన్న బ్రాండింగ్ ను UPA పక్షాలకు వేయడమే కాదు. తనను తాను జాతీయతకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించేసుకుంది బీజేపీ. బీజేపీ సిద్ధాంతం చాలా క్లియర్. వాళ్లు అనుకున్న విధంగా నేరుగా వెళ్లిపోతారు. కానీ మిగిలిన పక్షాల పరిస్థితి అలా కాదు. అందరి మన్ననలు పొందాలని ఎవరికీ దరి కాకుండా పోయాయి. భారత్ అయినా ఇండియా అయినా.. ఈ యునైటెడ్ ఫీలింగ్ నుంచి తాము దూరంగా జరిగామని భావన ఆ అలయెన్స్ లో ఉంది. పైగా ఈ సోషల్ మీడియా యుగంలో సమగ్రతకు సంబంధించిన బలాన్ని కూడా వారు చూడగలిగారు.

భారత్ జోడో యాత్రతోనే మొదలు !

ఇప్పుడు కొత్త అలయెన్సులో పాతిక పైగా పార్టీలు ఉన్నప్పటికీ.. ఇందులో పెద్ద కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ఆ లోటు భర్తీ చేసేందుకు పూనుకుంది. బీజేపీ చెబుతున్న భారత్ కు అదే భారత్ తోనే చెక్ పెట్టాలి అనుకున్నారు రాహుల్ గాంధీ. అందుకే కశ్మీరు- కన్యాకుమారిని కలిపేలా జోడో యాత్ర చేశారు. భారత్ అనే పదాన్ని సొంతం చేసుకోవడంతో పాటు.. బీజేపీ విభజిస్తుంటే.. తాము కలుపుతున్నామంటూ.. ప్రచారం చేశారు. మళ్లీ అదే పదాన్ని కాయిన్ చేస్తూ.. అలయెన్సు తీసుకురావడంలో రాహుల్ గాంధీ పాత్ర ఎక్కువుగా ఉంది. బెంగళూరులో ఈ పార్టీలన్నీ సమావేశం అయినప్పుడు.. ప్రొగ్రసివ్ పీపుల్స్ అలెయిన్స్, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్, పీపుల్స్ అలయెన్స్ ఫర్ ఇండియా, సేవ్ ఇండియా వంటి పేర్లు వచ్చాయి. సీతారాం ఏచూరి లాంటి వాళ్లు అసలు అలయెన్స్ అనే పేరే వద్దు ఎందుకంటే.. ఈ పార్టీలు రాష్ట్రాల్లో పోటీ పడుతున్నాయి అన్నారు. వుయ్ ఫర్ పీపుల్ అంటూ పెడదాం అని ప్రతిపాదించారు. కానీ చివరకు.. ఇండియా అన్న పేరుపైనే రాహుల్ గాంధీ పట్టుబట్టారు. ఈ ఆలోచన మమతా బెనర్జీది అని TMC చెప్పుకుంటోంది. లేదు రాహుల్ కు వచ్చిన ఆలోచన అని కాంగ్రెస్ వర్గాలు పమమతా బెనర్జీ చెప్పారని. .అందులో నుంచే ఈ పేరును తీసుకున్నారని చెబుతున్నారు. అయితే ఈ పేరులో D ని రిప్రజెంట్ చేసేలా డెమక్రటిక్ ఉండాలి అని కొందరు వాదిస్తే.. డెవలప్‌మెంట్ ఉండాలని కొందరు చెప్పారు. డెమక్రటిక్ అన్న పేరు NDA లో ఉంది కాబట్టి.. డవలెప్‌మెంట్ కే ఓటేశారు. ఇప్పుడు ఇండియా అనే కూటమికి భారత్ జీతేగా అని ట్యాగ్ లైన్ కూడా జోడించారు. కాబట్టి ఇండియా, భారత్ అనే పదాలమీద పేటెంట్‌ కు ఇప్పుడు రెండు పక్షాలూ పోటీ పడుతున్నాయి.

ఇండియాకు.. మోదీ బెదిరారా..?

ప్రతిపక్ష పార్టీలన్నీ పట్నాలో మొదటి సమావేశం పెట్టాయి. 20కిపైగా పార్టీలు కలవడంతో బీజేపీ కాస్త కలవరపడింది. దానికి తోడు కర్ణాటక రిజల్ట్స్స్.. రేపు జరగబోయే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ ఎలక్షన్లలో గట్టి పోటీ ఉండటంతో బీజేపీ దూకుడు తగ్గించింది. బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చినా.. ఎన్డీఏ పక్షాలను ప్రభుత్వంలో చేర్చుకున్నప్పటికీ.. అది బీజేపీ ప్రభుత్వంగానే వ్యవహరించేది. అంతెందుకు ఎప్పుడూ హమారీ సర్కార్ అంటూ చెప్పుకునే నరేంద్ర మోదీ.. మంగళవారం మీటింగ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పారు. ఎన్టీఏ పక్షాల ప్రభుత్వంపై ఇతర దేశాలు కూడా భరోసా కలిగి ఉన్నాయన్నారు. పెద్ద పెద్ద దేశాలన్నీ లక్షల కోట్ల డీల్స్ కుదుర్చుకుంటున్నారంటే.. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని వాళ్లకి కూడా తెలుసు అని చెబుతూ.. తన పక్షంలో ఉన్న పార్టీలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.

బలాబలాలేంటి..?

ప్రతిపక్ష కూటమి పాతిక పార్టీలతో జట్టు కట్టిందనగానే.. బీజేపీ పాత మిత్రులందరినీ లైనులో పెట్టింది. ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయిన అకాలీదళ్ ను వెనక్కు పిలిచింది. బిహార్ నుంచి పాశ్వాన్‌ ను లైనులోకి తెచ్చింది. ఇక పొత్తు ఉందో లేదో తెలీకుండా కొట్టుమిట్టాడుతున్న జనసేనకు ఇన్విటేషన్ పంపింది. ప్రస్తుతానికి పార్టీల సంఖ్య పరంగా చూస్తే… ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలున్నాయి. ప్రతిపక్ష కూటమిలో 26 పార్టీలున్నాయి. ఈ లెక్కల ప్రకారం పార్టీల బలం నిర్ణయించలేము కానీ.. రెండూ కూడా తమ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయన్న సందేశం ఇవ్వాలని ఇండియా కూటమి అనుకుంటే.. ఎన్డీఏ మిత్రపక్షాలను దూరం చేసుకోదు అన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అనుకుంది. అందుకే రెండు పక్షాలు కూడా ఒకేసారి మీటింగులు పెట్టాయి.

మోదీ పక్షంలో 38 పార్టీలున్నాయి.. కనీసం వాటిపేర్లు అయినా ఆయనకు తెలుసా అనే జోకులు గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే అయితే.. అసలు అందులో ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు ఎన్ని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలున్నా.. 300 సీట్లతో బీజేపీ ఇప్పటికైతే బలంగానే ఉంది. బీజేపీకి జతగా శివసేన, ఎన్సీపీల నుంచి చీలిన వర్గాలు బీజేపీతోనే కలిశాయి. ఇవి కాకుండా అన్నా డీఎంకే , ఆర్‌ఎల్.డి మాత్రమే చెప్పుకోదగ్గ పార్టీలు. ఇక మిగిలినవన్నీ పేరుకే కూటమి. వీటికి పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ లేదు. కొన్ని పార్టీలకు గుర్తింపు ఉందా అన్నది కూడా అనుమానమే.

ప్రతిపక్ష కూటమిలో అన్ని బలమైన పార్టీలే !

ప్రతిపక్ష కూటమిలో బీజేపీతో సమానంగా సీట్లు లేకపోయినప్పటికీ… అవన్నీ పెద్ద పార్టీలే. కనీసం 10-15సీట్ల సంఖ్యాబలం ఉన్న పార్టీలు. కాంగ్రెస్ , తృణమల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ, జనతాదళ్ యునైటెడ్,ఆర్‌జెడి, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం, ఇలా ఈ కూటమి బలమైన పార్టీలతో కలిసి ఉంది. అయితే రెండు కూటముల్లో లేకుండా బయట ఉన్న బలమైన పార్టీలు కూడా ఉన్నాయి. అవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏపీలో నెంబర్ 1, నెంబర్ 2 పార్టీలు రెండు కూటముల్లో లేవు. తెలంగాణలో నెంబర్ వన్ బీఆర్‌ఎస్ కూడా ఏ కూటమిలో లేదు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తానే స్వయంగా ఓ కూటమి కడతానని తిరుగుతున్నా పనవ్వడం లేదు. ఇక జనతాదళ్ సెక్యులర్, బీఎస్‌పీ పార్టీలు కూడా ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇన్ని పార్టీలు కలిసినా ఒక్క బీజేపీతో సమానం కావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీ తన సత్తా చూపుతోంది. కిందటి ఎన్నికల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఢిల్లీ, రాజస్థాన్ లో జరిగింది అదే. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మారాయి కానీ..పార్లమెంట్ లో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. కాబట్టి ఈ పార్టీల సంఖ్యను బట్టి కూటమి బలాన్ని అంచనా వేయలేం.

కానీ ఈసారి మాత్రం ప్రతిపక్ష కూటమి గట్టిప్రయత్నమే చేస్తోంది. పరిస్థితి ఇంతకు ముందు కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఇన్ని ఉన్నా.. ఇండియా కూటమికి ఆందోళన కలిగించేది.. ఎన్డీఏకి ఊరటనిచ్చేది ఏంటంటే ఈ పార్టీల అనైక్యత . ఇందులో చాలా పార్టీలు రాష్ట్రాల్లో ఫైట్ చేస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడే పరిస్థితిలేదు. అదే బీజేపీకి అలా కాదు. కొన్ని పార్టీలు తమతో లేకపోయినా.. బలవంతంగా తమతో కలిసి ఉండేట్లు చేసుకోగలుగుతుంది. బిజూ జనతాదళ్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఈ మూడూ బలమైన పార్టీలు .. ఇవి ప్రస్తుతానికి బయట ఉన్నా.. ఎన్డీఏలో ఉన్నట్లే. రేపు పరిస్థితి మారితే కేసీఆర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ఆ పక్షంలో మొన్నటి వరకూ పెద్ద పార్టీలుగా శివసేన, ఎన్సీపీలు చిక్కి శల్యం అయ్యాయి. ఇంకో ఏడాదిలో వీరిలో ఎంత మంది ఉంటారో పోతారో కూడా చెప్పలేని పరిస్థితి. నరేంద్రమోదీ నాయకత్వాన్ని గట్టిగా వద్దు అని ప్రజలు అనుకుంటే తప్ప.. మిగతావి ఏవీ పనిచేయవు. ఈ లోపు పార్టీలు తమ శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తున్నాయి.