వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్న టార్గెట్ తో పని చేస్తోంది కాంగ్రెస్. కర్ణాటక ఫలితాల తర్వాత పూర్తిగా రూట్ మార్చిన కాంగ్రెస్… రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టింది. పొంగులేటి, జూపల్లి వంటి నేతలను తమవైపుకు తిప్పుకోవటంతో పాటు… ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టి విజయవంతం చేసింది. ఇదే వేదిక నుంచి కీలకమైన హామీలను ప్రకటించింది. బీఆర్ఎస్ పై పోరాడే విషయంలో రాహుల్ గాంధీతో స్పష్టమైన ప్రకటన చేయింది. ఇదే నెలలో కొల్లాపూర్ వేదికగా మరో భారీ సభను నిర్వహించబోతుంది. ఇందుకు ప్రియాంక గాంధీని రప్పించబోతుంది. ఈ సభ సందర్భంగా చాలా మంది నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల చేరికలకు సంబంధించి కూడా రేపోమాపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్నికలకు మరికొద్ది నెలలే మిగిలి ఉండటంతో… నిత్యం ప్రజల్లో ఉండటంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడిగా పోరాడే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.