Manipur Viral Video Parade Fought In Army For Country But Couldnt Protect Wife Says Manipur Woman Husband | Manipur Viral Video Parade: కార్గిల్‌లో దేశం కోసం పోరాడా, భార్యను కాపాడుకోలేకపోయా

Manipur Viral Video Parade: మణిపూర్ లో గిరిజిన మహిళలను మరో వర్గం వారు నగ్నంగా ఊరేగించిన ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. విచ్చలవిడి ప్రవర్తనపై దేశం మొత్తం తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆనాటి ఘటన గురించి బాధితులు చెబుతున్న విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన బాధిత యువతి.. విస్తుపోయే నిజాన్ని బయటపెట్టింది. అక్కడే ఉన్న పోలీసులు తమను అల్లరి మూకకు వదిలేశారని, తమకు పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

మే 4వ తేదీన జరిగినట్లు చెబుతున్న ఈ దిగ్భ్రాంతికర ఘటనలో ఓ బాధిత మహిళ భర్త ఆర్మీలో పని చేశారు. అప్పటి ఘటనపై స్పందించిన ఆర్మీ జవాను.. తాను సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడానని, శ్రీలంకలో పీస్ కీప్ దళంలో పని చేశానని.. అలాంటిది భార్యను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు అల్లరి మూక తమపైకి జంతువుల్లా ఎగబడ్డారని చెప్పారు. ఆయుధాలతో బెదిరించారని అన్నారు. భారత సైనికుడికి జరిగిన ఈ ఘోరాన్ని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి అమానుష ఘటనలు మరిన్ని జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ ఊరు యుద్ధభూమి కంటే ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.

ఇరు వర్గాల మధ్య పోరులో అల్లరి మూకలు ఓ గ్రామంపై ఎగబడ్డాయి. ఈ క్రమంలో తప్పించుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలపై ఆందోళనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతడి 19 ఏళ్ల కుమారుడు , 21 ఏళ్ల కుమార్తె, 52, 42 ఏళ్ల ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిపై అల్లరి మూక దాడి చేయగా.. వారు పరుగన వెళ్లి సమీప పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. 

దాదాపు 800 నుంచి 1000 మంది ఉన్న భారీ గుంపు పోలీసుల నుంచి వారిని లాక్కెళ్లారు. ఈ క్రమంలో 21 ఏళ్ల యువతిని గుంపులోని వారు లాక్కెళ్తుండగా.. 19 ఏళ్ల యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. గుంపులో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు అతడిపై దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. తర్వాత ఆ యువతిని లాక్కెళ్లి బట్టలూడదీసి ఊరేగించారు. తర్వాత పొలంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మే 18వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జులై 19వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన మహిళలపై మరో వర్గం వారు ప్రవర్తించిన కీచక తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అత్యంత ఘోరమైన ఘటనకు సంబంధించి తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ అనే వ్యక్తినిపోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. 

Source link