gdp of india for financial year 2023 24 or FY24 is at 8 2 percent fiscal deficit also came down

Indian Economy Growth Rate: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో సూచించే కీలకమైన GDP (Grass Domestic Production) డేటా వెలువడింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (NSO) GDP గణాంకాలను శుక్రవారం నాడు (31 మే 2024) విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం… 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. FY24 చివరి త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి కాలం) జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గింది. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో చైనాలో 5.3 శాతం వృద్ధి రేటును నమోదైంది.

మొదటి మూడు త్రైమాసికాల్లో 8 శాతం పైగా వృద్ధి       
2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు త్రైమాసికాల్లోనూ జీడీపీ వృద్ధి రేటు 8 శాతానికి పైగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం చొప్పున వృద్ధి చెందింది. అంతకుముందు, సెప్టెంబర్ త్రైమాసికంలో 8.1 శాతం & జూన్ త్రైమాసికంలో 8.2 శాతంగా ఉంది. ఆ మూడు త్రైమాసికాల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ అన్ని అంచనాలను మించి, 8 శాతం పైగా వృద్ధి రేటును సాధించింది. చివరి త్రైమాసికంలో ఆ మార్క్‌ను అందుకోలేకపోయింది.

NSO రిలీజ్‌ చేసిన డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్‌ రేట్‌ 8.2 శాతం. దీనికిముందు, 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇది 7.0 శాతంగా నమోదైంది. రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) కూడా 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6.7 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగింది. వాస్తవ జీడీపీ 7.8 శాతంగానూ, వాస్తవ GVA 6.3 శాతంగానూ ఉండవచ్చని గతంలో అంచనా వేశారు. అయితే, తాజా గణాంకాలు ఈ అంచనాలను అధిగమించాయి.

కీలక పాత్ర పోషించిన తయారీ, గనుల రంగాలు         
2023-24 ఆర్థిక సంవత్సరంలో నామినల్‌ జీడీపీ గ్రోత్‌ రేట్‌ 9.6 శాతంగా ఉంది. తయారీ రంగం ‍‌(Manufacturing Sector) కారణంగా రియల్ జివీఏలో భారీ జంప్ కనిపించింది. గత ఫైనాన్షియల్‌ ఇయర్‌లో తయారీ రంగం వృద్ధి 9.9 శాతంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని -2.2 శాతం నుంచి ఇది గణనీయంగా పుంజుకుంది. దీంతోపాటు, గనుల రంగంలోనూ ‍‌(Mining Sector) భారీ అభివృద్ధి కనిపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని 1.9 శాతం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతానికి పెరిగింది.

తగ్గిన ద్రవ్యలోటు
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక లోటు సుమారు రూ. 16.54 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి రూ.23.26 లక్షల కోట్ల స్థూల ఆదాయం వస్తే, వ్యయం రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. ఒక ఏడాదిలో దేశ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దానిని ద్రవ్య లోటుగా (Fiscal Deficit) పిలుస్తారు. ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తే అది 5.6 శాతానికి తగ్గింది. 

మరో ఆసక్తికర కథనం: ఆరోగ్య బీమా కోసం 15 రకాల ప్రభుత్వ పథకాలు, వీటిలో చాలా స్కీమ్‌లు ‘ఉచితం’

మరిన్ని చూడండి

Source link