China Explosion 31 People Died LPG Gas Leak China Restaurant Know More Details | China Explosion: చైనాలోని ఓ రెస్టారెంట్ లో భారీ పేలుడు

China Explosion: వాయువ్య చైనాలోని యిన్‌ చువాన్‌లోని ఓ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 31 మంది చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. బుధవారం (జులై 21) రాత్రి 8.40 గంటల సమయంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. గురువారం ఉదయం (జులై 22) చైనా ప్రభుత్వ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రెస్టారెంట్ లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందని.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించింది. 

ఏడుగురికి తీవ్ర గాయాలు – ఒకరి పరిస్థితి విషమం

రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా వెల్లడించిన వివరాల ప్రకారం.. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లీక్, బార్బెక్యూ రెస్టారెంట్ ఆపరేషన్ సమయంలో పేలుడు సంభవించింది.  ఏడుగురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా..మరో ఇద్దరికి చిన్నపాటి గాయాలయ్యాయి. గ్లాస్‌లు పగిలిపోయి అవి శరీరానికి గుచ్చుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. క్షతగాత్రులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. పేలుడు సంభవించిన తర్వాత స్థానిక అగ్నిమాపక, రెస్క్యూ సేవలకు సంబంధించిన 100 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 20 వాహనాలను సంఘటనా స్థలానికి పంపి.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు. 

చైనాలో వరుస ప్రమాదాలు – పదుల సంఖ్యలో ప్రజల మృతి

వరుస భారీ అగ్ని ప్రమాదాలు చైనాను వణికిస్తున్నాయి. గత నెలలోనే చైనీస్ పెట్రో కెమికల్ ప్లాంట్ లో పేలుడు జరిగి తొమ్మిది మంది మరణించారు. రెండు నెలల క్రితం చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దేశ రాజధాని బీజింగ్ లో చాంగ్ ఫెంగ్ ఆసుపత్రి భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 71 మంది ప్రాణాలను కాపాడారు. కొన్నాళ్ల క్రితం బెజియాంగ్ ప్రావిన్సులో ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా కొన్నాళ్ల క్రితం చైనాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఉదయం నాలుగు  గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇలా వరుస అగ్ని ప్రమాదాలు చైనాలో భయాందోళనను కల్గిస్తున్నాయి. ఈ ప్రమాదాలపై లోతుగా దర్యాప్తు చేసి.. బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో. 

Source link