అసలేం జరిగింది?
అనకాపల్లి జిల్లాలోని కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనాథాశ్రమంలో విద్యార్థులకు పంచి పెట్టిన సమోసాలు తిని నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అనకాపల్లి అనాథశ్రమంలో నలుగురు చిన్నారుల మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం డివిజన్ పరిధిలోని కైలాసపట్నంలో ఉన్న అనాథాశ్రమంలో 80 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా సమీపంలోని గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసీలు. శనివారం సాయంత్రం అల్పాహారంగా విద్యార్థులకు సమోసాలను ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. శనివారం పాఠశాల ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఆదివారం అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఒకటో తరగతి చదువుతున్న జాషువా, మూడో తరగతి చదువుతున్న భవానీ, శ్రద్ధ, నిత్యలు ప్రాణాలు కోల్పోయారు.