Ola EV Scooter customer sets showroom on fire for not repairing his bike in Kalaburagi

Ola Showroom Fire: ఓలా కస్టమర్ ఒకరు తన ఈవీ బైక్ స్కూటర్ సర్వీసు పట్ల అసహనం చెంది బీభత్సం చేశాడు. కోపంతో ఏకంగా షోరూంనే తగులబెట్టేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో చోటు చేసుకుంది. నిందితుడు 26 ఏళ్ల మహ్మద్ నదీమ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేశామని, ప్రస్తుతం అతణ్ని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు కూడా నమోదైనట్లు చెప్పారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నదీమ్ తన ఓలా బైక్ రిపేర్‌కు రావడంతో సర్వీస్ సెంటర్‌లో ఆగస్టు 28న సర్వీస్ కోసం ఇచ్చాడు. సెంటర్ నుంచి తన బైక్ డెలివరీ తీసుకొని నడుపుతున్నప్పటికీ పదే పదే అదే సమస్య తలెత్తుతుండడంతో నదీమ్ విసిగిపోయాడు. ఎన్ని సార్లు సర్వీస్ సెంటర్ కు బైక్ ను తీసుకెళ్లినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో నదీమ్ సహనం కోల్పోయాడు. తాను పదే పదే షోరూంకు తిరుగుతూ, తన సమస్యను వివరిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న నదీమ్ ఏకంగా షోరూంకే నిప్పు పెట్టాడు. 

ఓలా ఈవీ బైక్ కొనేందుకు నదీమ్ దాదాపు రూ.1.4 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ, కొన్ని కొద్దిరోజులకే కొన్ని సాంకేతిక సమస్యలు అందులో తలెత్తుతూ వచ్చాయి. బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ విషయంలో తరచూ సమస్యలు వచ్చినట్లుగా స్థానిక వార్తా పత్రికలు రాశాయి. స్వయంగా మెకానిక్ అయిన నదీమ్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఓలా సర్వీస్ సెంటర్ ను సంప్రదించాల్సి వచ్చింది. 

కలబురిగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూంకు సమీపంలోనే ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ ను కొనుగోలు చేసిన నదీమ్.. నేరుగా ఓలా షోరూంకు వెళ్లాడు. పెట్రోల్‌ను ఓలా షోరూంలో చల్లి వెంటనే నిప్పు పెట్టాడు. దీంతో అందులోని కొత్త స్కూటర్లు అన్ని కాలిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఈ మంటలకు 6 ఈవీ స్కూటర్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వీటి మొత్తం నష్టం అంచనా రూ.8.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తొలుత తాము షార్ట్ సర్క్యూట్ అనుకున్నామని, కానీ మంటలకు అసలు కారణం నదీమ్ అని తెలిసి వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడ్ని ప్రశ్నిస్తున్నామని, అతనిపై కేసు కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మరిన్ని చూడండి

Source link