Singer Zoheb Khan Experience With Ratan Tata: దేశం గర్వించదగ్గ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు వీడ్కోలు పలికేశాం. రతన్ టాటా మానవీయ సంబంధాలు, ఆయన సింప్లిసిటీ, సాహసాలు, ప్రవర్తన ఇవన్నీ చాలా మంది రెండు రోజులుగా గుర్తు చేసుకుంటున్నారు. ఇది కూడా రతన్ టాటా ఎలాంటి వ్యక్తో చెప్పే ఓ సంఘటన. విఖ్యాత పాప్ గాయకుడు జోహెబ్ ఖాన్ స్వయంగా పంచుకున్న సంగతి ఇది. పాకిస్థాన్‌కు చెందిన జోహెబ్ తన సోదరి నజియాతో కలిసి 1980ల్లో పాప్ గీతాలతో దక్షిణాసియాను ఉర్రూతలూగించారు. బాలీవుడ్‌కు పాప్ కల్చర్‌ను పరిచయం చేశారు. జోహెబ్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే…
“నజియా.. జోహెబ్..! ఎవరో రతన్ టాటా అంట.. మీకు ఫోన్ చేశారు.. “ అని మా అమ్మ చెబుతూ నదియాకు ఫోన్ అందించారు. “నా పేరు రతన్, నేనో మ్యూజిక్ కంపెనీ ప్రారంభిస్తున్నా.. CBS India దాని పేరు. మీకు కుదిరితే నువ్వూ.. జోహెబ్ దాని కోసం ఓ ఆల్బమ్ రికార్డు చేయాలి.” అన్నారు.
“నేను వచ్చి మిమ్నల్ని కలవొచ్చా”
“అమ్మా రతన్ మ్యూజిక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి మనల్ని కలవొచ్చా అంటున్నారు” నజియా ఉత్సాహంగా మా అమ్మతో చెప్పింది.
“ఇవాళ కాదు శుక్రవారం అని చెప్పు” అని అమ్మ చెప్పింది.
“మిస్టర్ రతన్ మీరు వచ్చే శుక్రవారం వింబుల్డన్‌లో ఉన్న మా ఇంటికి రావొచ్చు” అని నజియా బిజినెస్ డీల్ చేస్తున్న ధోరణిలో చెప్పింది.
ఆ శుక్రవారం పొడవైన, హుందాగా డ్రస్ చేసుకున్న ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చారు. చాలా మృదువుగా మాట్లాడిన ఆ వ్యక్తి మాట్లాడుతున్నంత సేపు ఆయన మోహంపై చిరునవ్వు చెదరలేదు. ఆయన చాలా సిన్సియర్‌గా మాట్లాడినట్లు అనిపించింది. ఆయన ఎవరో నిజంగా మాకు తెలీదు. అలాగే ఆయన కూడా తన గురించి పూర్తి వివరాలు చెప్పలేదు. “మీకు ఇది ఓకే అయితే అగ్రిమెంట్ చేసుకుందాం. అలాగే అది ఖరారు చేసుకునే ముందు మీ తల్లిదండ్రులు, లాయర్‌కు కూడా దాన్ని చూపించండి. ఒకవేళ ఇష్టం కాకపోతే ఇప్పుడే నేరుగా చెప్పేయండి” అని మాత్రమే అన్నారు.
ఆ తర్వాత జరిగింది ఏంటో అందరికీ తెలుసు. మేం #YoungTarang ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశాం. ఇండియా, మొత్తం దక్షిణాసియాలోనే అప్పటికి అలాంటి మ్యూజిక్ వీడియో రాలేదు. ఇది 1983 నాటి సంగతి. అప్పుడే యు.ఎస్ లో #MTV మొదలైంది. వాళ్లు అది చూసి థ్రిల్ అయ్యారు. MTV కోసం ఇంగ్లిషులో అలాంటి వీడియో ఏమైనా చేయగలరా అని మమ్మల్ని అడిగారు.
మా ఆల్బమ్ యంగ్ తరంగ్ లాంచ్ సందర్భంగా మరోసారి మేం ఆయన్ను కలిశాం. ముంబై తాజ్ హోటల్‌లో లాంచ్ జరిగింది. అప్పుడే CBS India ఎండీ… రతన్ టాటా ఎంత గ్రేట్ మ్యాన్ అన్నది మాకు చెప్పారు. అప్పటివరకూ మాకు ఆయన గురించి తెలీదు. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక రతన్ నన్ను, నజియాను ఆయన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించారు. ఇండియాలోని పవర్‌ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే ఆయన ఏ ప్యాలెస్‌లోనో ఉంటారనుకున్నాం. అది అందంగా అలంకరించిన ఓ చిన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అంతే. అక్కడే ఆయన చెల్లెల్ని, సర్వెంట్‌ను, ఆయన జెర్మన్ షెఫర్డ్ డాగ్‌నూ చూశాం. ఒక అసామాన్య వ్యక్తితో చేసిన అతి సాధారణ డిన్నర్ అది. మేం జీవితంలో అది మర్చిపోలేం.
ఆ తర్వాత కూడా ఆయన్ను చాలా సార్లు కలిశాను. ఓసారి లండర్ బాండ్ స్ట్రీట్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. నేను పలకరిస్తే.. “ ఎలా ఉన్నావ్ జోహెబ్, నజియా, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని పలకరించారు.”
“రతన్.. వాళ్లు చాలా బాగున్నారు. మీరు యు.కె ఎందుకు వచ్చారు” అని అడిగితే నవ్వుతూ.. “కొన్ని విమానాలు కొనుక్కెళదామని వచ్చా” అన్నారు. ఆ తర్వాత నాకు అర్థం అయింది. ఆయన Air India కోసం కొన్ని విమానాలు కొనడానికి వచ్చారని. అప్పట్లో ఎయిర్ ఇండియాకు ఆయనే ఓనర్.
ఒక అత్యున్నత పారిశ్రామిక వేత్త, ఒక నిజమైన జెంటిల్‌మెన్ కూడా కాగలరు అనడానికి రతన్ టాటానే నిదర్శనం.
పాక్ సంతతికి చెందిన జోహెబ్, నజియా యు.కె లో సెటిల్ అయ్యారు. అప్పట్లో వీళ్ల పాప్ ఆల్బమ్స్ యువతను ఊర్రూతలూగించేవి. బాలీవుడ్ మూవీ Quirbani లోని ఆప్ జైసా కోయీ సాంగ్‌తో నజియా బాలీవుడ్ ను ఊపేశారు. 15 ఏళ్ల వయసులోనే ఆ పాట పాడిన నజియా దానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత పదేళ్లలో వీళ్లిద్దరూ 1992 వరకూ 5 మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించారు. అయితే నజియా అనారోగ్యం తర్వాత వాళ్ల మ్యూజిక్ జర్నీకి బ్రేక్ పడింది. ఆ తర్వాత కొంతకాలానికి 2000లో నజియా లంగ్ క్యాన్సర్ తో మృతి చెందింది. ఆ తర్వాత జెహెబ్ చాలా కాలం సింగింగ్ కెరీర్‌కు దూరంగా ఉన్నారు. పాకిస్థాన్ సినిమాల్లో యాక్టర్‌గా నటించారు. మళ్లీ ఈమధ్య తిరిగి పాటలు మొదలుపెట్టారు.
Also Read: Tata Trusts New Chairman: టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా – ఏకగ్రీవంగా ఎన్నిక
మరిన్ని చూడండి