according to a report indians are taking more smartphones and marriage loans in 2024

Indians Are Availing More Smartphone Loans: మన దేశంలో బ్యాంకింగ్‌ సేవలు ప్రజలకు చేరువకావడంతో లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు కూడా జనం కోర్కెలు తెలుసుకుని మరీ రుణాలు ఇస్తున్నాయి. ఇప్పుడు, భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లు కొనడానికి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. 

37 రెట్లు పెరిగిన రుణగ్రహీతలు
రిపోర్ట్‌ ప్రకారం, గత 4 ఏళ్లలో భారతీయుల షాపింగ్ ట్రెండ్స్‌ అతి వేగంగా మారాయి. సరికొత్త లైఫ్‌స్టైల్‌ కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య 37 రెట్లు పెరిగింది. కొవిడ్ 19 తర్వాత షాపింగ్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. 2020లో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాల కోసం 1 శాతం మంది లోన్లు తీసుకోగా, 2024లో ఆ నంబర్‌ 37 శాతానికి పెరిగింది. ఇప్పుడు, జనం తమ ఇంట్లో మార్పులు చేయడానికి అవసమైన డబ్బుల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. లోన్‌ తీసుకుని లేటెస్ట్‌ మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటివి కొనుగోలు చేస్తున్నారు. 

లైఫ్‌స్టైల్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనే బలమైన కోరిక
హోమ్ క్రెడిట్ ఇండియా రిపోర్ట్‌ ‘హౌ ఇండియా బారోస్’ ప్రకారం, చాలామంది ప్రజలు తమ ఇంటిని, జీవనశైలిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనే బలమైన కోరికలో ఉన్నారు. దీనికోసం, వినియోగ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా లోన్లు తీసుకుంటున్నారు. అంతేకాదు.. వ్యాపారం చేసేందుకు, ఇంటికి కొత్త రూపు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నారు. వ్యాపార విస్తరణ కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య 2020లోని 5 శాతం నుంచి 2024 నాటికి 21 శాతానికి పెరిగింది. వ్యాపారం చేయాలన్న కోరిక బలపడుతోందనడానికి ఇది నిదర్శనం. తమకు తాముగా కొత్త అవకాశాలు సృష్టించుకుని ఆదాయ వనరులు పెంచుకోవాలనుకుంటున్నారు. MSMEలకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు కూడా ఈ విషయంలో అనువైన వాతావరణాన్ని సృష్టించింది. 

అప్పు చేసి పప్పు కూడు
తమ కలల సౌధాన్ని నిర్మించుకోవాలనే కోరిక కూడా ప్రజలలో ప్రబలంగా ఉంది. లేటెస్ట్‌ ట్రెండ్స్‌కు తగ్గట్లు ఇంటిని రీమోడల్‌ చేయడానికి లోన్‌ తీసుకునే వారి సంఖ్య కూడా 2022లోని 9 శాతం నుంచి 2024 నాటికి 15 శాతానికి పెరిగింది. వైద్య చికిత్సల సంబంధ కారణాలతో అప్పు చేస్తున్న వారి సంఖ్య ఇదే కాలంలో 7 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. కొవిడ్‌ తర్వాత మెరుగైన ఆర్థిక ప్రణాళికతో పాటు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పెంచుకోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. చదువు కోసం అప్పులు తీసుకుంటున్న వారి సంఖ్యలో మార్పు రాలేదు, అది అప్పుడు-ఇప్పుడు 4 శాతం వద్దే ఉంది. అయితే.. పెళ్లి కోసం రుణాలు తీసుకునే వారి సంఖ్య 3 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. 

యాప్ ద్వారా బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్‌
హోమ్ క్రెడిట్ ఇండియా మన దేశంలోని 17 నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. టాప్-7 మెట్రో నగరాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ సర్వేలో, 18-55 ఏళ్ల మధ్య వయసున్న 2,500 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. వారి సగటు ఆదాయం నెలకు 31,000 రూపాయలు. ప్రజలు టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నారని, వాడకమంటే ఏంటో చూపిస్తున్నారని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ల ద్వారా బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్‌ల మీటర్‌ బరబరా పెరుగుతోంది. EMI ఫెసిలిటీకి విపరీతమైన పాపులారిటీ కొనసాగుతోంది.

మరో ఆసక్తికర కథనం: Gold Rate Today 19 October 2024: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు – తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా

మరిన్ని చూడండి

Source link