జనసైనికులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

అవును.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులు, వీరాభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా విషయంలో అటు వైసీపీ.. ఇటు టీడీపీ, జనసేన ఒకరికొకరు అస్సలు తగ్గట్లేదు. వైసీపీ కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. తామేం తక్కువ కాదన్నట్లుగా టీడీపీ, జనసేన కార్యకర్తలు, కొందరు నేతలు నోరు జారుతున్న పరిస్థితి. ఈ వ్యవహారానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన అధినేత స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు జనసేన శతాగ్ని టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని తప్పుడు పోస్టులు పెడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగానే హెచ్చరించింది. కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నట్లు జనసేన శతాగ్ని టీం పేర్కొన్నది.

బాధ్యతగా..

సోషల్ మీడియాను బాధ్యతగా, సమాజానికి పనికొచ్చేలా వినియోగించాలని పోస్ట్‌లో సలహాలు, సూచనలు చేసింది. ముఖ్యంగా పార్టీ విధి విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలను, అంతకుమించి పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని వెల్లడించింది. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యవహరించినా సరే జనసేన కార్యకర్తలు మాత్రం సంయమనంతో వ్యవహరించాలని సూచన చేసింది. పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఎవరేం చేస్తున్నారనే విషయాలన్నింటినీ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని కూడా శతాగ్ని టీం తెలిపింది. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలకు సమయానుకూలంగా పార్టీ, పార్టీ నాయకులు స్పందిస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. అంటే తప్పు చేసిన వారు తాట తీసుడే అని చెప్పకనే చెప్పేసిందన్న మాట. అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇలా పోస్ట్ పెట్టడం జరిగిందని, ఇక తప్పులు జరగకుండా చూసుకోవాలని అప్పుడే పార్టీ కార్యకర్తల్లో చర్చ కూడా మొదలైంది.

తప్పుడు పోస్టులు వద్దే వద్దు

ఇతర రాజకీయ నాయకులపై కానీ, సినీ నటులపై కానీ, ఏ ఇతర అంశాలపై కానీ తప్పుడు వార్తలు.. అసభ్యకర పదజాలం.. మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం.. మహిళలు, పిల్లలపై తప్పుడు పోస్టులు పెట్టడం లేదా అలాంటి వారిని ప్రోత్సహించడం చట్టబద్దమైన నేరం. ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలు చర్చించేందుకు, సద్విమర్శలు, సూచనలకు సోషల్ మీడియా వేదిక కావాల్సిన అవసరం ఉందని, మీకు ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే మీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా శతాగ్ని టీం ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు పవన్ సూచించిన విధంగా సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న నేపథ్యంలో.. పార్టీ శ్రేణులు ఇతరులకు ఆదర్శంగా నిలబడాలని శతాగ్ని టీం కోరింది. మొత్తానికి చూస్తే.. మరో వైసీపీ లాగా కాకూడదని, కేసుల భారీన అస్సలు పడకూడదని ముందస్తుగానే పవన్ నుంచి వచ్చిన క్లియర్ కట్ ఆదేశాలతో తన టీమ్ ఇలా ప్రకటన రూపంలో తెలిపింది.

Source link