చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టిన జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎంతలా అంటే అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. మధ్యలో జనసేన కార్యకర్తలు ఇదేం ఖర్మరా బాబు అని ఫీల్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రశ్నించారని కార్యకర్తలు మొదలుకుని నేతలు ఆఖరికీ వైసీపీ ఎమ్మెల్యేలను సైతం వదలట్లేదు. ఇప్పటికే వందల సంఖ్యలో వైసీపీ కార్యక్తలను అరెస్ట్ చేసిన పోలీసులు గ్యాప్ లేకుండా కేసులు, నోటీసుల పర్వం నడుస్తూనే ఉంది. ఇందుకు వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ప్లాన్ చేసింది. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పడినట్లయింది.

ఎవ్వరూ తగ్గట్లేదు..!

వాస్తవానికి సోషల్ మీడియా అనేది పనికొచ్చే పనులకు వాడుకోవడం అనేది ఎపుడో పోయింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టానుసారం వాడేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలు, సినిమాల విషయంలో ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల నుంచి 2024 నిన్న, మొన్నటి వరకూ అన్ని పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాళ్ల భరతం పడుతోంది టీడీపీ కూటమి. ఈ విషయంలో టీడీపీ, జనసేన ఏమైనా తక్కువా అంటే అబ్బే అస్సలు కానే కాదు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు చెప్పొచ్చు. సరిగ్గా ఇవే పట్టుకున్న వైసీపీ.. రివర్స్ ఎటాక్ చేస్తోంది. వైసీపీ నేతలు మొదలుకుని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబంపై జుగుప్సాకరంగా పోస్టులు, ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఈ ఫిర్యాదులు స్వీకరించి, కనీసం రీసీప్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.

రంగంలోకి జగన్..

ఒకవైపు అరెస్ట్ అయిన కార్యకర్తలు, నేతలకు లీగల్ సపోర్టు ఇవ్వడం, మరోవైపు టీడీపీకి చెందిన ఐటీడీపీ సోషల్ మీడియా బాగోతాలు, ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు చేసిన పోస్టుల తాలూకు ఆధారాలతో జిల్లాస్థాయి నేతలే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే స్వయంగా రంగంలోకి దిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ హయాంలో, వైసీపీ అధికారంలో ఉండగా వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలపై హైదరాబాద్ వేదికగా జూబ్లీహిల్స్ ఎన్బీకే బిల్డింగ్ నుంచి చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ అసభ్య పదజాలంతో పోస్టులు, వార్తలు కొన్ని వెబ్ సైట్లు ద్వారా రాపించారని.. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై కూడా జగన్ మీడియాకు వివరించారు. అంతేకాదు ఇదే విషయంపై వైఎస్ షర్మిల మాట్లాడిన వీడియోను కూడా జగన్ ప్లే చేసి చూపించారు. దీంతో జగన్ కదనరంగంలోకి దిగారని అందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. అప్పట్లో షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.

మీకో న్యాయం.. మాకో..!

పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పించిన జగన్, ఏ ఒక్క విషయాన్ని వదలకుండా ప్రస్తావించి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్న పరిస్థితి. అంతే కాదు ఈ క్రమంలోనే వివేకం లాంటి సినిమాలు తీయచ్చు, సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ తీసుకొని ఆర్జీవీ సినిమా రిలీజ్ చేయకూడదా? చేస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఇలా ఒకటా రెండా టీడీపీపై ప్రశ్నలు, విమర్శలు, ఆరోపణలతో మీడియా సమావేశంలో గట్టిగానే ఇచ్చిపడేశారు. ఇంకా చెప్పాలంటే మీకో న్యాయం, మాకో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ఇలా ఒకటా రెండా అన్ని విషయాలూ జగన్ మాట్లాడారు. దీంతో వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, చంద్రబాబు మొత్తంగా ప్రభుత్వాన్ని జగన్ ఇరుకున పెట్టారు. ఇప్పుడీ విషయం పెద్ద ఎత్తునే చర్చనీయాంశం అయ్యింది. ఈ ప్రశ్నలు టీడీపీ, జనసేన నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనేది చూడాలి.

Source link