ఎవరిని నిందించాలి.. పవన్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధికారులు వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉండగా, నిస్సహాయత వ్యక్తం చేస్తే సామాన్య మానవుడు ఎవరి వద్దకు వెళ్తారు? అని పవన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో పరిపాలన ఆదర్శవంతంగా, ప్రశంసించేలా ఉండాలని సూచించారు. అధికారులు అంటే ఎలా ఉండకూడదో చేసి నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అధికారుల సహకారం కావాలని కోరారు. గత ప్రభుత్వ చేసిన పనులన్నీ మూలాలను కదిలించే స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి గెలిచి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మూలాల నుంచి తొలగించే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమిని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారని, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలానే ఆశిస్తున్నారన్నారు. అందుకే వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు సలహాలు, సూచనలు చేశారు.

బాధ్యత లేదా?

అధికారులు మౌనం వహించడం వల్లే రాష్ట్రం రూ.10 లక్షల కోట్లు అప్పులు మిగిలాయని సేనాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తాము చేయగలమని, వాటిని సమర్దవంతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లే గురుతర బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై ఉందని మరోసారి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినా, ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్‌ జరుగుతుంటే ఎవరిని నిందించాలి? అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది కలెక్టర్ల బాధ్యత కాదా? ఎస్పీ బాధ్యత కాదా? ఎలా వదిలేశారు? చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తున్నా అధికారుల నుంచి సహకారం ఉండట్లేదన్నారు. విజిలెన్స్ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తే నాదెండ్ల వెళ్లి సీజ్ చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

స్ట్రాంగ్ వార్నింగ్

అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కల్తీలపై చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. చంద్రబాబు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అధికారుల సహకారం అందించాలని పవన్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులను పెట్టి సినిమా టికెట్లు అమ్మించడం, ఇసుక దోపిడీ, ఇంకా అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇంత జరుగుతున్నా, ఇంతమంది ఐఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కానీ, ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏంటి? ఐఏఎస్ చదివి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం అనిపించిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Source link