Kakinada News : వర్షాకాలంలో చెరువులు, వాగులు పొంగి పొర్లుతూ ఉండే పరిస్థితి ప్రతీ ఏటా కనిపించేది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో భారీ వర్షాలకు గోదావరి పొంగి లంక గ్రామాలు నీట మునిగాయి. కానీ కాకినాడ జిల్లాలో వింత పరిస్థితి కనిపిస్తుంది. గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామాలు సాగు, తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొల్లప్రోలు మండలంలోని ఏకే మల్లవరం సహా చుట్టుపక్కల 10 గ్రామాలకు వ్యవసాయమే ఆధారం. జులై నెలలో కురిసిన వర్షాలకు నీరు అందుతుందన్న నమ్మకంతో అప్పులు తెచ్చి వరి నాట్లు వేశారు రైతులు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. గత పదిరోజులుగా చినుకు కూడా పడలేదు. దీంతో పంటపొలాలు ఎండిపోయాయి. ఎకరానికి రూ.15-20 వేలు పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పూర్తిగా ఎండిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం తాగడానికి నీరు లేదని, పశువులకు కూడా నీరు దొరకడంలేదంటున్నారు. చెరువులు, తూములకు మరమ్మతులు లేకపోవడంతో నీరు వచ్చే సదుపాయంలేకపోయిందని అంటున్నారు. నీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయని అధికారులను అడిగితే పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు రైతులు.