Maha Kumbh Special Story: రామాయణంలో శ్రవణ కుమారుడి గొప్పతనం ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పురాణాల ప్రకారం, శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకు సేవ చేసి, కీర్తి గడించాడు. ఈ కలియుగంలో అలాంటి శ్రవణుడే మహా కుంభమేళాకు వెళుతూ కెమెరాలకు చిక్కాడు. కుంభమేళాకు సంబంధించిన అనేక వీడియోలు ఇటీవలి కాలంలో ఎంతో పాపులర్ అయ్యాయి. అదే తరహా వీడియో ఇప్పుడు తెగ షేర్ అవుతోంది. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిని సంగంలో స్నానం చేయించాలని సంకల్పించిన ఆ ఓ కొడుకు.. ఆమెను ఓ ఎద్దుల బండిలో కూర్చోబెట్టుకుని, దాన్ని భుజాలపై మోస్తూ, కుంభమేళాకు కాలి నడకన బయలుదేరాడు. రోజూ దాదాపు 50 కి.మీ. ప్రయాణిస్తోన్న అతన్ని చూసిన వారంతా చలించిపోతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం, ముజఫర్‌నగర్ నగరంలో నివసించే చౌదరి సుదేష్ పాల్ మాలిక్ తన 92 ఏళ్ల తల్లి జగ్విరీ దేవితో కలిసి మహా కుంభమేళాలో స్నానం చేయడానికి కాలినడకన బయలుదేరాడు. తన తల్లి నడవలేని స్థితిలో ఉన్నందున ఆమె కోసం ఓ చెక్క బండిని తయారు చేశాడు. అందులో తన తల్లిని కూర్చోబెట్టుకుని, ఆ బండిని లాగుతూ, కాలి నడకన బయల్దేరాడు. మహా కుంభానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే కాలినడకన వెళ్లి, సంగంలో స్నానం చేయాలని కోరుకుంటున్నట్టు తన తల్లి చెప్పడంతో సుదేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతకుముందు తన కాళ్లు చాలా నొప్పుగా అనిపించేవని, తన మోకాళ్లు బాగా చెడిపోయాయని సుదేష్ చెప్పాడు. కానీ ఎలాంటి మందులు తీసుకోకుండానే తన తల్లి ఆశీస్సులతో నొప్పి నయమైందన్నారు. అందుకే కాలినడకన నడుచుకుంటూ తన తల్లిని తీసుకుని మహా కుంభమేళాలో స్నానం చేయిస్తానని అనుకున్నాడు. 13 రోజుల పాటు ప్రతిరోజు 50 కి.మీ దూరం ప్రయాణించాలన్నది అతని లక్ష్యం. గతేడాది కూడా సుదేష్ తన తల్లిని భుజాలపై ఎత్తుకుని హరిద్వార్‌కు గంగాస్నానానికి వెళ్లాడు. ఈ సారి సంగంలో స్నానం చేయించేందుకు ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాకు కాలి నడకన బయలుదేరాడు. తాను పెట్టుకున్న లక్ష్యం 13 రోజులైనప్పటికీ.. 12 రోజుల్లోనే కుంభమేళాకు వెళ్లి, తన తల్లిని సంగంలో స్నానం చేయిస్తానని సుదేష్ చెబుతున్నాడు. ఈ సంఘటన అతని అసాధారణ ప్రయత్నం అపారమైన ధైర్యం, సంకల్పం, భక్తిని ప్రతిబింబిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోకు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. అనేక మంది కామెంట్స్ కూడా చేశారు.
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఆ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. వారు అతన్ని సింహ హృదయ కుమారుడని కొనియాడారు. ‘కలియుగ శ్రవణ్ కుమార్’ అని మరి కొందరు పిలిచారు. ప్రతి తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుందని మరొకరన్నారు. ఇకపోతే ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలోని సంగంలో రెండో పవిత్ర స్నానాలాచరిస్తున్నారు.
Also Read : Snow Sculpture: తెల్లటి మంచుతో అద్భుతమైన శిల్పాలు అదుర్స్ – అంతర్జాతీయ పోటీలో భారత్‌కు కాంస్యం, బ్యూటిఫుల్ వీడియో చూశారా?
మరిన్ని చూడండి