income tax free state in india sikkim residents are exempt from paying income tax | No Income Tax: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్

Budget 2025: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను కూడా ఒక అంశం. ఫిబ్రవరి 01వ తేదీన టాక్స్‌ శ్లాబ్‌లు, మినహాయింపులపై ఎలాంటి ప్రకటన వస్తుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఆదాయ పన్ను గురించి పట్టింపే లేని రాష్ట్రం మన దేశంలోనే ఒకటి ఉంది. ఎందుకంటే, ఆ రాష్ట్రంలో ఆదాయ పన్ను 100% రద్దయింది. ఆ రాష్ట్రం.. ‘సిక్కిం’ (Income tax-free state Sikkim).

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) వరుసగా ఎనిమిదో బడ్జెట్ సమర్పణకు సిద్ధమయ్యారు, ఫిబ్రవరి 01 శనివారం రోజున కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో, భారతదేశంలోని ఏకైక పన్ను రహిత రాష్ట్రమైన సిక్కిం ఇప్పుడు హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టంలోని ఆర్టికల్ 371(F) & సెక్షన్ 10(26AAA) కింద, సిక్కిం నివాసితులు పూర్తి ఆదాయ పన్ను మినహాయింపును (Sikkim residents are completely exempt from income tax) పొందుతారు. 

సిక్కిం వాసులకు ఎందుకీ స్పెషల్‌ ఆఫర్‌?
1975లో, ఇండియన్‌ యూనియన్‌లో సిక్కిం రాష్ట్రం విలీనమైన సమయంలో, భారత ప్రభుత్వంతో ఈ రాష్ట్రం ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సిక్కిం ప్రజలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు లభించింది. ఈ ప్రత్యేక హక్కు అక్కడి ప్రజల ఆదాయాన్ని పెంచుతోంది & పెట్టుబడులను ఆకర్షిస్తోంది. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా, సిక్కిం నివాసితులు ఆదాయ పన్ను నుంచి 100% మినహాయింపు పొందారు, రూ.కోట్ల సంపాదించినా ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కరలేదు. ఈ పన్ను రహిత ప్రత్యేకత సిక్కిం ఆర్థిక వృద్ధిని వడివడిగా నడిపిస్తోంది. పర్యాటకం, వ్యవసాయం & చిన్న వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తోంది.

సిక్కిం సబ్జెక్ట్స్ రెగ్యులేషన్ 1961 కింద “సిక్కిమీస్‌” (Sikkimese)గా గుర్తింపు పొందిన అందరు వ్యక్తులు.. తాము సంపాదించే వడ్డీ రాబడి, డివిడెండ్‌లతో సహా ప్రతి రూపాయి ఆదాయంపైనా పూర్తి పన్ను మినహాయింపు పొందుతారు. సిక్కిం ప్రజలకు లభించే ఈ ప్రత్యేక హక్కుకు భద్రత కూడా కల్పించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (F) & ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10 (26AAA) ద్వారా ఈ మినహాయింపునకు రక్షణ ఏర్పాటు చేశారు. 

పన్ను చెల్లించకపోయినా ITR ఫైల్‌ చేయాలా?
భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు ఒక పరిమితిని మించిన ఆదాయాల ఆధారంగా ఆదాయ పన్ను చెల్లించాలి. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR) దాఖలు చేయడానికి, సాధారణంగా, జులై 31 చివరి తేదీగా ఉంటుంది. అయితే, సిక్కిం నివాసితుల ఆదాయం రూ.కోట్లకు చేరుకున్నప్పటికీ వాళ్లకు ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌ వర్తించవు. కాబట్టి, సిక్కిం నివాసితులు ఆదాయ పన్ను పత్రాలను కూడా సమర్పించాల్సిన అవసరం లేదు, ITR దాఖలు నుంచి మినహాయింపు పొందారు.

PAN కార్డ్‌ విషయంలోనూ మినహాయింపు 
ఆదాయ పన్ను చెల్లింపు మినహాయింపు మాత్రమే కాదు.. మార్కెట్ రెగ్యులేటర్ ‘సెబీ’, సిక్కిం నివాసితులకు పాన్ కార్డ్‌ అంశంలోనూ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు షేర్ మార్కెట్ (Share Market), మ్యూచువల్ ఫండ్స్‌లో ‍‌(Mutual Fund) పెట్టుబడి పెట్టాలంటే పాన్ కార్డ్ కచ్చితంగా అవసరం. ఈ విషయంలో సిక్కిం ప్రజలకు మినహాయింపు ఉంది. వాళ్లు పాన్ కార్డ్ లేకుండా కూడా స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌ ముందు బంగారానికి భలే డిమాండ్‌ – దాదాపు రూ.4400 పెరిగిన పుత్తడి రేటు 

మరిన్ని చూడండి

Source link