Economic Survey 2025 On Inflation: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఓవరాల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గినప్పటికీ, ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయని, సామాన్యుడిని భయపెడుతూనే ఉన్నాయని ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 2023-24 ఆర్థిక సంవత్సరంలోని (FY24) 5.4 శాతం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25) ఇప్పటి వరకు 4.9 శాతానికి తగ్గిందని ఎకనమిక్ సర్వే డాక్యుమెంట్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల సూచిక (CPI)లో మార్పు ద్వారా లెక్కిస్తారు.
FY24 & 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాన ద్రవ్యోల్బణం (Core Inflation – ఆహారేతర & ఇంధనేతర ద్రవ్యోల్బణం)లో 0.9 శాతం తగ్గుదలకు రిటైల్ ద్రవ్యోల్బణంలో తగ్గుదల కారణమైంది. సరఫరా పరిస్థితులు మెరుగుపడడం & వాతావరణంలో అనుకూల మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు తగ్గి, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణిలోకి వచ్చింది. అయితే.. చైనా, భారతదేశం, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు దీనికి విరుద్ధమైన ట్రెండ్‌లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతున్నాయి. అయితే… మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు & రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆహార ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రపంచ స్థాయి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు మరింత అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబించాయి. అయితే.. వృద్ధి అవసరాలు & ద్రవ్యోల్బణ తగ్గింపు వేగాన్ని బట్టి వివిధ దేశాల్లో వడ్డీ రేట్ల కోతల్లో వేగం మారుతూ ఉంటుంది, ఇది ఆర్థిక పునరుద్ధరణలో వ్యత్యాసాలను సృష్టిస్తుంది” అని సర్వే తెలిపింది.
పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం
భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణం 2023-24 ఆర్థిక సంవత్సరంలోని 7.5 శాతం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్-డిసెంబర్ కాలంలో) 8.4 శాతానికి పెరిగింది. కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి కొన్ని ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల వల్ల ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల సంభవించింది. సరఫరా గొలుసులో ఇబ్బందులు, అనూహ్య ప్రతికూల వాతావరణ పరిస్థితులు వంటి అంశాల వల్ల దేశంలో ఆహార ధరలపై ఒత్తిడి ఏర్పడింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ఆహార ధరల సూచిక (CFPI) ద్వారా కొలుస్తారు.
CPI కొలమానంలో కూరగాయలు, పప్పుధాన్యాలు మొత్తం 8.42 శాతం వెయిటేజీని కలిగి ఉన్నప్పటికీ, మొత్తం ద్రవ్యోల్బణంలో వాటి వాటా FY25లో ఇప్పటి వరకు 32.3 శాతంగా ఉందని సర్వే వెల్లడించింది. ఆహార ధాన్యాలతో పోలిస్తే, తుపానులు, కరవులు & భారీ వర్షాలు వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలకు కూరగాయలు ఎక్కువగా నష్టపోతాయని సర్వే పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో కూరగాయల ధరలు తగ్గడంతో పాటు ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి రావడం వల్ల ధరలు తగ్గి ఆహార ద్రవ్యోల్బణం కొంచెం తగ్గుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న ప్రధాన కారణాల్లో వ్యవసాయ పరికరాల ధరలు పెరగడం & ప్రతికూల వాతావరణ ఇబ్బందులు ఉన్నాయి.
ఇటీవల కాలంలో, గ్లోబల్ మార్కెట్‌లో ఇంధనం & కమొడిటీస్ ధరలు తగ్గాయి. ఈ పరిణామం, ప్రధాన ద్రవ్యోల్బణ అంచనాలపై సానుకూల ప్రభావాన్ని చూపింది. అయితే, ప్రపంచ రాజకీయ & ఆర్థిక అనిశ్చితుల కారణంగా నష్టాలు కొనసాగుతున్నాయి అని ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్ ఉంటుంది?
మరిన్ని చూడండి