8th Pay Commission Latest News Update: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక అప్డేట్ వచ్చింది. 8వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది జీతం ప్రస్తుత స్థాయి నుంచి భారీగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ప్రయోజనం కనీసం ఏడాది పాటు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే, పెరిగిన జీతం ఒక సంవత్సరం పాటు చేతిలోకి రాకపోవచ్చు. ఎందుకంటే, ఎనిమిదో వేతన సంఘం ప్రాతిపదికన, జీతాల పెంపు కోసం, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) పార్లమెంటులో సమర్పించిన 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో (Union Budget For FY 2025-26) భారత ప్రభుత్వం ఎలాంటి డబ్బును కేటాయించలేదు.
వాస్తవానికి, ఎనిమిదో వేతన సంఘం కోసం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ మాత్రమే కోరుతున్నారు. ఈ విధంగా చూస్తే, ఎయిత్ పే కమిషన్ నివేదిక రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాతే జీతభత్యాల పెంపు నిర్ణయం వెలువడుతుంది. అంటే.. ఏ స్థాయి ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందో నిర్ణయించడానికి మరో సంవత్సర కాలం పట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగే జీతాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే, భారత ప్రభుత్వం తన తదుపరి బడ్జెట్లో అంటే 2026-27 బడ్జెట్లో ఆ పద్దు కోసం డబ్బును ఏర్పాటు చేయగలదు.
టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ సూచించమని మంత్రిత్వ శాఖలకు లేఖలు
మనీకంట్రోల్ రిపోర్ట్ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ కూడా, భారత ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన సంఘం ప్రకారం పెరిగిన జీతం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రమే పొందడం సాధ్యం అవుతుందని అంగీకరించారు. ప్రస్తుతం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సిబ్బంది & శిక్షణ మంత్రిత్వ శాఖలకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను సూచించాలని కోరుతూ లేఖ పంపింది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే 8వ వేతన సంఘం పనిలోకి దిగుతుంది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్‌ను భారత ప్రభుత్వం ఆమోదించిన వెంటనే పే కమిషన్ తన పనిని ప్రారంభిస్తుందని వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: ఒకేసారి రూ.4,400 తగ్గిన గోల్డ్ రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
గత కమిషన్‌కు ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం
మునుపటి కమిషన్, అంటే ఏడో వేతన సంఘం (7th Pay Commissio) తన నివేదికను సమర్పించడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం మార్చి 2025 నాటికి ఏర్పాటైనప్పటికీ, పని పూర్తి చేయడానికి కనీసం ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఎయిత్ పే కమిషన్ రిపోర్ట్ 2026 మార్చి కంటే ముందు రాదని అర్ధమవుతుంది.
మరో ఆసక్తికర కథనం: రూపాయి చారిత్రాత్మక పతనం, డాలర్‌తో పోలిస్తే తొలిసారి రూ.87 కు క్షీణత
మరిన్ని చూడండి