Budget Session 2025: కుంభమేళాలో గత నెల 29న మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పటిష్ఠ చర్యలు లేకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే విషయాన్ని సోమవారం పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీల ఎంపీలు పెద్దఎత్తున నిరనసలు చేపట్టారు. తొక్కిసలాటపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేలా చూడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరినా ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజకీయ పార్టీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
ఈ సందర్భంగా ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి దేశం మొత్తం ఆందోళన చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుంభమేళా ఇదివరకు జరిగింది. ఇకపై కూడా జరుగుతుంది. కానీ పోయిన 30 మంది ప్రాణాలు తిరిగిరావు. దీనిపై అధికారంలో రాజకీయ పార్టీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. దీనిపై సభలో కచ్చచితంగా ర్చించాలి’ అని సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం పేర్కొన్నారు.
మండిపడ్డ స్పీకర్ ఓం బిర్లా
అయితే ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ నినాదాలు ఆగలేదు. దీంతో వారి నిరసనలను స్పీకర్ ఖండించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇక్కడ టేబుల్స్ విరగ్గొట్టేందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు. మీరు బల్లలు పగలగొట్టడానికే ఇక్కడికి వచ్చిఉంటే.. వాటిని ఇంకా గట్టిగా కొట్టండి’ అని అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల మధ్యే లోక్‌సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
తొక్కిసలాట ఘటనపై కమిషన్ ఏర్పాటు
తొక్కిసలాటకు దారితీసిన కారణాలు, పరిస్థితులను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నెల రోజుల్లోపు విచారణ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఈ ప్యానెల్ సిఫారసులు కూడా అందించనుంది.
తొక్కిసలాటలో 30 మంది మృతి
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు ఈ నెల 29న మౌని అమావాస్య కారణంగా భారీగా జనం తరలివచ్చారు. అయితే తెల్లవారుజామున దాదాపు 2.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగి 30 మంది మృతిచెందారు. 60 మందికిపైగానే గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు 3 గంటల పాటు క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ సాగింది. విపరీతమైన రద్దీ వల్ల చీకట్లో అక్కడున్న చెత్త డబ్బాలకు కాళ్లు తగిలి ఒకరిమీద ఒకరు పడడంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పుణ్యస్నానాల నిలిపివేత.. ఆపై పునరుద్ధరణ తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొన్ని గంటలపాటు పుణ్య స్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక అమృత స్నానాలను పునరుద్ధరించారు.
మరిన్ని చూడండి