India ranks 4th in global firepower index 2025 | Global Firepower Index 2025 : గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025లో టాప్ 5లో నిలిచిన భారత్

Global Firepower Index 2025 : భారత్ మరో ఘనత సాధించింది. 2025 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి గల దేశాలలో టాప్ 5లో భారత్ నిలిచింది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 (GFP Index)లో ఇండియా 4వ స్థానాన్ని పొందింది. సైనిక విభాగాలు, ఆర్థిక పరిస్థితి, లాజిస్టిక్స్ సామర్థ్యాలను సహా 60కి పైగా అంశాల అంచనా ఆధారంగా ర్యాంకింగ్ లు రూపొందించారని గ్లోబర్ ఫైర్ పవర్ అధికారిక వెబ్ సైట్ వెల్లడించింది. 

శక్తివంతమైన సైనిక శక్తి గల దేశాల్లో టాప్ 5లో భారత్

గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్ విడుదల చేసిన జాబితా ప్రకారం, అగ్రరాజ్యమైన అమెరికా 0.0744 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, చైనా నిలిచాయి. ఇక 4వ స్థానంలో భారత్ ఉంది. భారత్ స్కోరు 0.1184గా ఉంది. భారతదేశం ఇప్పడు ప్రపంచ వేదికగా తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. ఈ ర్యాంకింగ్ ఆర్మీ, నేవీ, వైమానిక దళంలో భారతదేశం విస్తరిస్తున్న రక్షణ సామర్థ్యాలను హైలైట్ చేస్తోంది. ఇక దక్షిణ కొరియా టాప్-5 శక్తివంతమైన సైనిక శక్తులలో చోటు దక్కించుకుని ఐదో స్థానంలో నిలిచింది. మరోపక్క తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ 2024లో 9వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయింది. ఆ దేశం వద్ద పెద్ద మొత్తంలో అణ్వాయుధాలున్నప్పటికీ.. కనీసం టాప్ 10 జాబితాలో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. పాకిస్థాన్ బ్రెజిల్ కంటే దిగువన 12వ స్థానంలో ఉండడం గమనార్హం. వైమానిక దళం, నావికాదళం పరంగా కూడా ఇండియా పొరుగు దేశమైన పాకిస్థాన్ కంటే కూడా బ్రెజిల్ చాలా ముందుంది.
 
అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన టాప్-10 దేశాలు

1.అమెరికా 

2.రష్యా 

3.చైనా 

4. భారతదేశం

5.దక్షిణ కొరియా 

6.బ్రిటన్ 

7.ఫ్రాన్స్ 

8.జపాన్ 

9.టర్కీ

10.ఇటలీ
 
భారతదేశం వృద్ధి వెనుక ఉన్న కారకాలివే

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం పెరుగుదల మూడు సైనిక శాఖలలో దాని ఆధునీకరణ ప్రయత్నాలకు కారణమని చెప్పవచ్చు. భారత సైన్యం 1.45 మిలియన్ క్రియాశీల సిబ్బంది, 1.15 మిలియన్ రిజర్వ్ దళాలు, 25 లక్షలకు పైగా పారామిలిటరీ సిబ్బందిని కలిగి ఉంది. దాంతో పాటు T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్ వ్యవస్థలు వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) విషయానికొస్తే మొత్తం 2,229 విమానాలు, ఇందులో 600 ఫైటర్ జెట్‌లు (రాఫెల్, Su-30MKI), 899 హెలికాప్టర్లు, 831 సహాయక విమానాలు ఉన్నాయి. అస్త్ర, రుద్రం, నిర్భయ్, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలతో పాటు రాఫెల్, సు-30MKI వంటి యుద్ధ విమానాలతో కూడిన కీలక ఆస్తులున్నాయి.
 
ఇక ఇండియన్ నేవీ విషయానికొస్తే 142,251 మంది సిబ్బందిని కలిగి ఉంది. ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలతో సహా 150 యుద్ధనౌకలు, జలాంతర్గాములతో పటిష్టంగా ఉంది. వీటితో పాటు అణు జలాంతర్గాములు, P-8i సముద్ర నిఘా విమానం, మరో 50 కొత్త నౌకలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి భారతదేశ నౌకాదళ శక్తిని మరింత పెంచనున్నాయి.

2025లో అత్యంత శక్తివంతమైన దేశాలలో భారతదేశం ర్యాంక్

ఫోర్బ్స్ తాజా ర్యాకింగ్ ప్రకారం, అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉంది. ఆర్థిక పరిస్థితులు, బలమైన అంతర్జాతీయ పొత్తులు, సైనిక బలం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ను నిర్ణయిస్తారు. ప్రపంచ జీడీపీ పరంగా, యూఎస్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారతదేశం 5వ స్థానంలో ఉంది.

Also Read : Vehicle Insurance Check : టోల్‌గేట్స్‌కు కొత్త బాధ్యతలు- కారు ఓనర్లకు దబిడిదిబిడే- ఇన్సూరెన్స్ లేకపోతే జైలుకే!

మరిన్ని చూడండి

Source link