Ancient surya temple in kashmir -Martanada surya temple

Martand Sun Temple:  మనదేశంలో సూర్య దేవాలయం అనగానే కోణార్క, అరసవిల్లి లాంటి ప్రముఖ దేవాలయాలు గుర్తు వస్తాయి. కానీ వీటిని తలదన్నే ఒక బ్రహ్మాండమైన ఆలయం  కాశ్మీర్లో ఎప్పుడో కట్టారు. ఒడిశాలోని కోణార్క్ టెంపుల్ కన్నా  500 సంవత్సరాల ముందే కాశ్మీర్ లోని మార్తాండ దేవాలయాన్ని నిర్మించారు అక్కడి రాజులు. చరిత్ర మరిచిపోయిన అతి గొప్ప కాశ్మీర్ రాజు ” ముక్తాపీడ లలితాదిత్య  (724CE -740CE )” నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయం  ఆనాటి కళావైభవానికి మచ్చు తునకగా చరిత్రలో నిలిచిపోయింది. 600 సంవత్సరాల పాటు యాత్రికులని భక్తులని ఆకర్షించిన ఈ సూర్య దేవాలయాన్ని 14 వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ సుల్తాన్ ‘సికిందర్ షా మిరి ‘ ధ్వంసం చేశాడు.

Also Read: రథ సప్తమి పూజా సులువుగా చేసుకునే విధానం.. పాలు పొంగించాల్సిన సమయం ఇదిగో!

పురాతన కాశ్మీర్ నిర్మాణ శైలికి ఉదాహరణ – మార్తాండ సూర్య దేవాలయం 

కాశ్మీర్ లోని ఒక ఎత్తైన పర్వతం పై నిర్మించిన మార్తాండ దేవాలయంలో గాంధార, గుప్త, చైనా నిర్మాణ వైఖరిలు కనిపిస్తాయి. ఈ దేవాలయం దగ్గర నిలబడితే మొత్తం కాశ్మీర్ లోయను  చూడొచ్చు . ఈ దేవాలయం ఎంత పెద్దదంటే దీని చుట్టూ ఉన్న గోడ ఆవరణలో  గంగ, యమున,విష్ణు లాంటి ఇతర దేవతలు కూడా ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో అతిపెద్ద సూర్య భగవానుడి ఆలయం నిర్మించి ఉంటుంది. శ్రీనగర్ కు  67 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ మార్తాండ దేవాలయం ప్రాచీన కాశ్మీర్ హిందూ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా  ప్రస్తుతం మారిపోయింది.

ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన  ఈ సూర్య దేవాలయం  15వ శాతాబ్దం లో ధ్వంసమైంది.  కాశ్మీర్ ను పరిపాలించిన షా మీర్ రాజవంశానికి చెందిన ‘ సికందర్ బుత్షిఖాన్ ‘ చాలా దేవాలయాల్ని నాశనం చేశాడు. వాటిలో మార్తాండ సూర్య దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని నాశనం చేయడానికి అతని సైనికులకు చాలా కాలం పట్టిందని అప్పటి కవి,చరిత్రకారుడు “జోనరాజు ” తన ‘ద్వితీయ రాజ తరంగిణి (1430 CE) లో పేర్కొన్నాడు. మార్తాండ దేవాలయం తో పాటు విజయేశ్వర  (శివ ), చక్రాధారి (విష్ణు ),వరాహ (విష్ణు ) దేవాలయాలని కూడా సికందర్ షా నాశనం చేసాడు. అలాగే గుర్తు తెలియని ఇద్దరు దేవతలకు చెందిన సురేశ్వరి,త్రిపురేశ్వర ఆలయాలను కూడా అతను ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అయితే వీటన్నిటిలోనూ మార్తాండ దేవాలయం అతిపెద్దది. దీనిని పూర్తిగా నాశనం చేయలేక పోయింది  సికందర్ షా సైన్యం. గర్భగుడిని ధ్వంసం చేసినా బయటి ప్రకారాలు అలాగే ఉండిపోయాయి.  మధ్యలో వచ్చిన భూకంపాల వల్ల  ఆలయ రూపం మరి కొంత దెబ్బతింది. గత 500 సంవత్సరాలుగా విపరీతమైన వాతావరణాన్ని కూడా తట్టుకొని ఆలయ శిథిలాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గ రూపంలోనే ఉండడం విశేషం. 

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

 సినిమా షూటింగులకు పెట్టింది పేరు 
 

మార్తాండ సూర్య దేవాలయం వద్ద చాలా సినిమాల షూటింగులు జరిగాయి. ధర్మేంద్ర నటించిన ‘మన్ కి అంఖే (1970) నుండి షాహిద్ కపూర్ ‘హైదర్ ‘ (2014) వరకూ ఇక్కడ సినిమా షూటింగులు జరిగాయి. 

 పునర్నిర్మాణం చేస్తున్న జమ్మూ కాశ్మీర్  ప్రభుత్వం

మధ్యలో తీవ్రవాద శక్తులతో ఉక్కిరిబిక్కిరైన కాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. సినిమా షూటింగ్ లకు కూడా ప్రభుత్వం తరఫునుంచి ఆహ్వానాలు వెళుతున్నాయి.  సంస్కృతి పరంగా పూర్వ వైభవం సాధించేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు గతేడాది ప్రయత్నాలు ప్రారంభించింది. వారి ప్రయత్నం కనుక నెరవేరితే త్వరలోనే మార్తాండ సూర్య దేవాలయం  మరోసారి భక్తుల పాలిట బంగారం అయ్యే అవకాశం లేకపోలేదు.

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

మరిన్ని చూడండి

Source link