Surat couple gets married at police station while families argue over food at venue: సూరత్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఓ జంటకు పెళ్లి చేశారు పోలీసులు. వారేమీ ప్రేమించుకుని లేచిపోయి వచ్చిన వారు కాదు. మేజర్లమే కానీ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేయాలని అడిగిన వారు కాదు. ఇంకా చెప్పాలంటే వారి కోసం మంచి పెళ్లి మండపం.. రెడీగా ఉంది. పంతులు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి జరగాలని రాసి పెట్టి ఉంది. అలాగే ఉంది. అలా ఎందుకు జరిగిందో తెలిస్తే .. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోక తప్పదు.
సూరత్ లో నివాసం ఉండే రెండు కుటుంబాల్లోని అమ్మాయి, అబ్బాయిలకు పెళ్లి చేయాలని ఆ రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అతి ఆరెంజ్డ్ మ్యారేజ్. అన్నీ పక్కాగా మాట్లాడుకున్నారు. అమ్మాయి తరపు వాళ్లు పెళ్లి చేయడానికి అంగీకరించారు. వారే కళ్యాణమండపం బుక్ చేసుకున్నారు. పెళ్లికి సంప్రదాయంగా చేసినవన్నీ చేశారు. మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి తంతు బిగిన్ అయింది. అయితే కాసేపటికే మండపంలో గగ్గోలు రేగింది. సినిమాల్లో చూపించినట్లుగా ఇక్కడ పెళ్లి కొడుకో.. పెళ్లి కూతురో జంప్ కాలేదు. అసలు విషయం ఏమిటంటే.. పెళ్లి భోజనాలు అయిపోయాయట.
పెళ్లికి వచ్చిన వారికి ఓ వైపు భోజనాలు పెట్టేశారు. అయితే అబ్బాయి తరపు వారు చెప్పిన దాని కంటే ఎక్కువగా రావడంతో భోజనాలు త్వరగా అయిపోయాయి. చాలా మంది ఇంకా ఆకలితో ఉన్నారు. ఈ విషయాన్ని అమ్మాయి తరపు వారికి చెప్పారు. అయితే ఆకలితో ఉన్నారేమో కానీ అబ్బాయి తరపు వారు కాస్త ఓవర్ గా స్పందించారు. అది పెద్ద గొడవగా మారింది. ఓ వైపు వీరంతా వాదులుకంటూ .. అసలు పెళ్లి గురించి మర్చిపోయారు. ఇదేదో తేడాగా ఉందని భోజనాలు సరిపోలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారేమోన్న అనుమానంతో అమ్మాయి తరపు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి మండపంలో గొడవ జరుగుతోందని తెలియడంతో పోలీసులు వచ్చారు.
అసలు సమస్యేమిటో తెలుసుకున్నారు. వారికి కూడా ఈ సమస్య సిల్లీగానే అనిపించింది. కానీ పెద్దలకు ఎంత సర్ది చెప్పినా వారు వినే పరిస్థితుల్లో లేరు. దీంతో ఆ పెళ్లి ఆగిపోకుండా ఉండాలంటే ఒకటే మార్గమని నిర్ణయించుకున్నారు. అందర్నీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ పెద్దలు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా పెళ్లి చేసేశారు. పోలీస్ స్టేషన్లోనే ఆ జంటకు పెళ్లి అయిపోయింది. పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి ఇక పొట్లాడుకుని చేసేదేమీ లేదని ఆ కుటుంబాలు కలిసిపోయి తదుపరి కార్యక్రమాలు చేసుకోవడం ప్రారంభించాయి.
Also Read: ట్రంప్ టీంలో జెండా పాతేసిన 22 ఏళ్ల ఆకాష్ బొబ్బా – ఈ కుర్రాడి టాలెంట్ అలాంటిది మరి !
మరిన్ని చూడండి