సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ఈ రోజు మీడియాతో మాట్లాడడం సినీ వర్గాల్లో ఆసక్తి రేపింది. గత 14 సంవత్సరాలుగా పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన హఠాత్తుగా మీడియా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ ప్రెస్ మీట్లో రమేష్ బాబు తన గత అనుభవాలు, భవిష్యత్తు ప్రణాళికలు వివరించారు. ముఖ్యంగా ఖలేజా, కొమరం పులి సినిమాల వల్ల తనకు భారీ నష్టం వచ్చిందని దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టపోయాను అని చెప్పాడు. అంతేకాకుండా ఆ సమయంలో హీరోలు కనీసం ఓపిక పట్టలేదని తన పరిస్థితిని పట్టించుకోలేదని వాపోయారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గురించి అన్నట్లుగా అనిపించడంతో ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
దీనిపై నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ కొమరం పులి కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ ఇతర చిత్రాలకు ఇవ్వకుండా మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు. కానీ ఆ సినిమా ఆలస్యం కావడానికి పవన్ కారణం కాదు అని తేల్చేశారు. గణేష్ మాటలతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.
నిజానికి ఆ రెండు సినిమాల విడుదల ఆలస్యం వెనుక వివిధ కారణాలు ఉన్నాయి. కొందరి మాటల ప్రకారం మహేష్, పవన్ బాధ్యులు కారు. నిర్మాత వైపు నుండే కొన్ని సమస్యల వల్లే ఈ జాప్యం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై మళ్లీ చర్చ మొదలైంది.
చాలా కాలంగా మౌనంగా ఉన్న రమేష్ బాబు ఇంతకాలానికి బయటకు రావడానికి ప్రధాన కారణం తనపై ఉన్న కేసుల నుంచి విముక్తి పొందడం అని చెప్పుకున్నారు. అయితే సోషల్ మీడియా వలన చిన్న విషయాలు కూడా పెద్దగా మారుతున్న ఈ రోజుల్లో ఎవరైనా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం.
ఇప్పటికే బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి. శింగనమల రమేష్ మాటలపై దర్శకుడు ఎస్.జె. సూర్య స్పందిస్తారా..? త్రివిక్రమ్, మహేష్ బాబు ఏమైనా కామెంట్ చేస్తారా..? అనేది చూడాలి. కానీ ఏదేమైనా ఈ వివాదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం మాత్రం ఖాయం.