Dunki Route : డబ్బు సంపాదించాలన్న ఆశ, అమెరికాపై ఉన్న మోజుతో చాలా మంది భారతీయులు అక్రమ మార్గం గుండా అగ్రరాజ్యానికి వెళ్లారు. అయితే వలసదారులను కట్టడిచేసేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వారంతా వారంతా స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఓ విమానంలో 104 మంది భారతీయుల్ని ఇటీవలే స్వదేశానికి పంపగా.. వారు అమృత్‌సర్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అయితే అమెరికాలోకి ఎలా అక్రమంగా ప్రవేశించారో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన డేరియన్ గ్యాప్ అటవీ ప్రాంతాన్ని, అనేక అడ్డంకులను దాటుకొని వెళ్లినట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో శవాలను దాటుకుంటూ భయం గుప్పిట్లో వెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా డేరియన్ గ్యాప్ అటవీ ప్రాంతంపై చర్చ సాగుతోంది.
97 కిలోమీటర్ల అభయారణ్యం
కొలంబియా–పనామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే డేరియన్ గ్యాప్ (Darien Gap). ఇందులో ఉన్న ‘డంకీ రూట్’ మార్గం గుండా వెళ్లి యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తారు. అయితే ఎలాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎవరూ ఉపయోగించరు. కానీ ఎలాగైనా అమెరికాలో కాలుమోపాలనుకునే వారికి ఇదొక్కటే దొడ్డిదారి. అమెరికాలోకి అక్రమంగా అడుగుపెట్టేందుకు అలాస్కా నుంచి అర్జెంటీనా వరకున్న పాన్ అమెరికన్ హైవేలో ప్రధాన ఆటంకం. మొత్తం 97 కిలోమీటర్లు ఉండే ఈ అభయారణ్యంలో ఎత్తయిన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత పాములు, క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. చిత్తడి నేలలతో నిండిఉండే ఈ అటవీ ప్రాంతంలో నిరంతం ప్రతికూల వాతావరణం ఉంటుంది.
స్మగ్లర్లకు కీలక ప్రాంతం
ఎటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎవరూ ఉపయోగించరు. రహదారి అనే ఊసే ఉండదు. అక్కడ ఎలాంటి నిఘా ఉండదు కాబట్టే స్మగ్లర్లు తమ స్థావరాలుగా చేసుకుని డ్రగ్స్, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అమెరికాలోకి అక్రమంగా తరలించడానికి డేరియన్ గ్యాప్‌ను ముఠాలు ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి.
ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 15 లక్షల నుంచి 20 లక్షల వసూలు
ఈ మార్గాన్ని దాటేందుకు 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. వీసా సులభంగా లభించే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు అక్రమ వలసదారులను తరలిస్తారు. అక్కడ నుంచి మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి పంపే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం వారి వద్ద నుంచి రూ. 15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఈ ముఠాలు వసూలు చేస్తాయని ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో నివసిస్తున్న వ్లాగర్ ఆదిత్య తివారీ ఓ న్యూస్ ఛానల్‌కు వెల్లడించారు.
Also Read: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం లెక్కల వరకు – ఆర్‌బీఐ గవర్నర్ ప్రధాన ప్రకటనలు
మహిళపై డ్రగ్స్ ముఠాల అఘాయిత్యాలు
ఈ భయంకరమైన డంకీ రూట్ గుండా వెళ్లేవారు రోజుల తరబడి తిండి, నీరు లేక అనారోగ్యంతో చనిపోతుంటారు. దాడులు కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక మహిళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. డ్రగ్స్ ముఠాలు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఎవరైనా వారిని ఎదిరిస్తే ప్రాణాలు తీసేందుకు క్షణం కూడా ఆలోచించరు. ఇన్ని కష్టాలు దాటుకొని వెళ్లినా సరిహద్దుల్లో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు.
ఈ మార్గం గుండా ఏటా లక్షల్లో అక్రమ వలసలు
ఏటా లక్షల మంది ఈ డేరియన్ గ్యాప్ గుండా అమెరికాకు చేరుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023లో ఏకంగా దాదాపు 5.2 లక్షల మంది ఈ మార్గాన్ని దాటి అగ్రరాజ్యంలోకి ప్రవేశించారు. నిఘా కట్టుదిట్టం చేయడంతో గతేడాది 3 లక్షలకు తగ్గింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్ నుంచి వెళ్లే అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.
Also Read: ఈ యాప్ ఉంటే చాలు సైబర్ కాల్స్ రావు- కొట్టేసిన ఫోన్ బ్లాక్ అవుతుంది
మరిన్ని చూడండి