Secret Beneficiary In Ratan Tata’s Will: దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా రిజిస్టర్ చేసిన వీలునామాను ఇటీవలే ఓపెన్ చేశారు. అందులో ఉన్న విషయాలు రతన్ టాటా కుటుంబ సభ్యులను, సన్నిహిత వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఎందుకంటే, రతన్ టాటా విల్లులో ఓ వ్యక్తి పేరు ఉంది. తన మిగిలిన ఆస్తుల్లో మూడో వంతును అతనికి అప్పగించాలని దివంగత పారిశ్రామికవేత్త వీలునామాలో సూచించినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
“రహస్య వ్యక్తి” ఎవరు, అతనికి ఎంత ఆస్తి చెందుతుంది?
తన విల్లులో రతన్ టాటా పేర్కొన్న వ్యక్తి పేరు ‘మోహిని మోహన్ దత్తా’ (Mohini Mohan Dutta). జంషెడ్‌పూర్‌కు చెందిన మోహిని మోహన్ దత్తా ఇప్పుడు “ఎవరూ ఊహించని లబ్ధిదారు”గా మారారు. ట్రావెల్ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. రతన్ టాటా వీలునామా ప్రకారం, మోహిని మోహన్ దత్తాకు రూ.500 కోట్లకు పైగా ఆస్తి (మిగిలిన ఆస్తుల్లో మూడో వంతు) దక్కుతుందని అంచనా. ఈ విషయం తెలిసి టాటా కుటుంబం & సన్నిహితులు అవాక్కయ్యారని సమాచారం.
మోహిని మోహన్ దత్తా ఎవరు?
మోహిని మోహన్ దత్తాకు రతన్ టాటాతో ఉన్న అనుబంధం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తెలిసిన వాళ్లు చాలా కొద్దిమందే. కానీ, మోహిని మోహన్ దత్తా రతన్ టాటాకు సంవత్సరాలుగా విశ్వాసపాత్రుడిగా ఉన్నారని చెబుతున్నారు. మోహిని మోహన్ దత్తా కుటుంబానికి గతంలో స్టాలియన్ (Stallion) పేరిట ట్రావెల్ ఏజెన్సీ ఉంది. 2013లో, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ (Taj Group of Hotels)లో భాగమైన తాజ్ సర్వీసెస్ (Taj Services)లో స్టాలియన్ విలీనం అయిందని సమాచారం. ఈ విలీనానికి ముందు, మోహిని మోహన్ దత్తా & అతని కుటుంబానికి స్టాలియన్‌లో 80% వాటా ఉంది, మిగిలిన వాటాను టాటా ఇండస్ట్రీస్ కలిగి ఉంది. గతంలో, థామస్ కుక్ అనుబంధ సంస్థ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌లోనూ మోహిని మోహన్ దత్తా ఒక డైరెక్టర్‌గా పని చేశారని ఎకనమిక్ టైమ్స్ నివేదించింది.
ఆరు దశాబ్దాల బంధం
తాను టాటా కుటుంబానికి సన్నిహత వ్యక్తిని అని మోహిని మోహన్ దత్తా తరచూ చెప్పుకునేవారట. 2024 అక్టోబర్‌లో, రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా, ఆయనతో తనకున్న బంధం గురించి బహిరంగంగా మాట్లాడారు. రతన్ టాటాను తాను తొలిసారి జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో కలిశానని చెప్పారు. అప్పుడు ఆయన వయస్సు 24 సంవత్సరాలట. అప్పటి నుంచి బంధం బలపడిందని, రతన్ టాటా తనకు సాయం చేసి వృద్ధిలోకి తీసుకువచ్చారని మీడియాకు చెప్పారు. తమది ఆరు దశాబ్దాల అనుబంధం అని వెల్లడించారు.
2024 డిసెంబర్‌లో, ముంబైలోని NCPAలో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రతన్ టాటా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
దాతృత్వానికి సజీవ రూపం
రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం దాతృత్వానికి కేటాయించారు. జీవితాంతం దాతృత్వ కార్యకలాపాలు కొనసాగించారు. ఈ కార్యక్రమాల కోసం రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ అనే రెండు సంస్థలను స్థాపించారు. రతన్ టాటా వీలునామా ప్రకారం ఆస్తుల్లో వాటా పొందిన కొందరు కుటుంబ సభ్యులు, ఆ డబ్బును విరాళంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మరో ఆసక్తికర కథనం: సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రకటించిన ఆర్‌బీఐ
మరిన్ని చూడండి