Prime Ministers Care For Your Children With PM Children Care Scheme Know The Benefits Eligibility And Other Details | PM Children Care Scheme: మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ

PM CARES For Children Scheme Details In Telugu: విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ స్కీమ్‌. చదువుల కోసం ఆర్థిక ఆసరా అవసరమైన & అర్హత గల ప్రతి విద్యార్థికి ఏడాదికి 50,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద ఉపకార వేతనాలు, విద్య రుణాలు కూడా మంజూరు అవుతాయి. 

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద, 33 రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలో 4,543 మంది విద్యార్థులు ప్రయోజనాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 613 జిల్లాల్లో, పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్ పోర్టల్‌లో మొత్తం 9,332 దరఖాస్తులు వచ్చాయని లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలిపారు. వాటిలో 524 దరఖాస్తులు నకిలీవని వివరించారు. మిగిలిన 8,808 దరఖాస్తులను జిల్లా స్థాయి శిశు సంక్షేమ కమిటీలు & సంబంధిత జిల్లా న్యాయాధికారులు లేదా కలెక్టర్లు సమీక్షించారు. వారి తుది ఆమోదం ఆధారంగా, 4,543 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందుతున్నారని మంత్రి సావిత్రి ఠాకూర్‌ వెల్లడించారు.

ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

“ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ ఇప్పటికీ ఓపెన్‌లో ఉంది. తాము వెనుకబడ్డామని అర్హత గల దరఖాస్తుదారులు బాధ పడొద్దు. నమోదు చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది” అని ఠాకూర్ తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

PM చిల్డ్రన్ కేర్ స్కీమ్ వివరాలు

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని 2021 మే 29న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు చనిపోయి ఆ ఇంటి పిల్లలు చదువులకు దూరం అవుతున్న నేపథ్యంలో, వారికి ఆర్థిక సాయం అందించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్‌ చేసింది. ఈ పథకం కింద… 11 మార్చి 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో COVID-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడం ‘పీఎం కేర్స్‌’ (PM CARES) లక్ష్యం.

PM కేర్ చిల్డ్రన్ స్కీమ్ అర్హతలు

COVID-19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా సంరక్షకుడిని కోల్పోయిన & 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు PM కేర్ చిల్డ్రన్ స్కీమ్‌ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు.

PM చిల్డ్రన్ కేర్ స్కీమ్ ప్రయోజనాలు

  • PM కేర్ చిల్డ్రన్ స్కీమ్ కింద, ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం చదువు కోసం రూ. 50,000 ఆర్థిక సహాయం అందుతుంది. మొదటి సంవత్సరం చేరిన డిగ్రీ విద్యార్థులకు గరిష్టంగా 4 సంవత్సరాలు & డిప్లొమా విద్యార్థులకు గరిష్టంగా 3 సంవత్సరాలు సాయం లభిస్తుంది. కళాశాల ఫీజు చెల్లింపు, కంప్యూటర్, స్టేషనరీ, పుస్తకాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్ వంటి వాటి కొనుగోలు కోసం ఏకమొత్తంగా ఈ డబ్బు అందుతుంది. 
  • బంధువుల వద్ద నివసించే పిల్లలు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ. 4000 వరకు పొందవచ్చు. 
  • ఈ పథకం కింద, సమీపంలోని కేంద్రీయ విద్యాలయం/కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లేదా ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చు.
  • 1-12 తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ రూ.20,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • భారతదేశంలోని ప్రొఫెషనల్ కోర్సులు/ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు పొందడంలోనూ సహాయం అందుతుంది. ఆ రుణాలపై వడ్డీని PM CARES నిధి భరిస్తుంది.
  • అర్హత గల పిల్లలకు ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన’ (AB PM-JAY) కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్‌ ఉంటుంది. వాళ్లకు 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆరోగ్య బీమా కవరేజ్ వర్తిస్తుంది.
  • పీఎం కేర్స్‌ పథకం కింద, పిల్లలు స్వతంత్రంగా జీవించడానికి, ఆత్మవిశ్వాసం & ప్రేరణ కోసం సాయం అందుతుంది. 

పీఎం చిల్డ్రన్ కేర్ పథకం గురించి మరింత సమాచారం కోసం https://pmcaresforchildren.in/ ను సందర్శించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: గుడ్‌న్యూస్‌, భారీగా తగ్గిన పసిడి రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

Source link