CS(P)-IFOS(P)-2025 Application Date Extended: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)-2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తు గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 11తో గడువు ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 18 వరకు మొదట పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి గడువును యూపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21న సాయంత్రం 6 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 979 ఉద్యోగాలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) – 2025 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 22న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. జనవరి 22న దరఖాస్తు ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఖాళీల భర్తీకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే ప్రామాణికంగా భావిస్తారు. మెయిన్ పరీక్షను మాత్రం విడిగా నిర్వహిస్తారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేస్తారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
రాతపరీక్ష విధానం..
✦ ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
✦ మెయిన్స్ పరీక్ష విధానం (సివిల్ సర్వీసెస్):
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
✦ మెయిన్ పరీక్ష విధానం (ఐఎఫ్‌ఎస్):
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు మొత్తంగా ఆరు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో దానిలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఆప్షనల్స్ ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్ కాంబినేషన్లను అనుమతించరు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.02.2025. (6 PM) (21.03.2024 వరకు పొడిగించారు)
➥ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 25.05.2025.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని చూడండి