PM Internship Scheme Application: దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో విడత దరఖాస్తల స్వీకరణ ప్రారంభమైంది. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా విద్యార్థులకు పెద్ద సంస్థల్లో అప్రెంటిస్‌లుగా చేరేందుకు అవకాశం కలగనుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్నవారు మార్చి 12 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్1800116090 ద్వారా సంప్రదించవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 650 జిల్లాల్లో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన నిరుద్యోగులు, విద్యార్థులకు నెలకు రూ.5,000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఏడాది ఇంటర్న్‌షిప్ కాలంలో కనీసం 6 నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్) కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు.
దేశంలోని నలుమూల విద్యార్థులు ఈ పథకం కింద అవకాశాలు పొందగలరు. ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
వీరు అర్హులు..
ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్/దూరవిద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నవారితో పాటు ఎస్‌ఎస్‌సీ పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
వీరు అనర్హులు..
ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం ₹8లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ చేసినవారు.. సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు అనర్హులు.
ఏడాది శిక్షణ..
ఇంటర్న్‌షిప్‌లు ప్రోగ్రామ్ 12 నెలల పాటు కొనసాగుతుంది. నెలకు రూ.5000 చొప్పున ఏడాదికి రూ.60,000 స్టైఫండ్ ఇస్తారు.
ఈ జాగ్రత్తలు అవసరం..
పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
➥ అభ్యర్థులు మొదట తమ ఆఫర్ లెటర్‌ను సమీక్షించుకోవాలి. ఇంటర్న్‌షిప్ ప్లేస్, కంపెనీ, స్టైఫండ్, వ్యవధికి సంబంధించిన అన్ని వివరాలు సరైనవేనా అని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే ఆఫర్‌ను అంగీకరించాలి.
➥ మీ ఆఫర్ లెటర్‌లో పేర్కొన్న నిబంధనలతో ఏకీభవిస్తే, ఆఫర్ లెటర్ పై సంతకం చేసి, తిరిగి పంపడం లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ధృవీకరించడం చేయాలి.
➥ దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించే ముందు కంపెనీకి అందించాల్సిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
➥ ఐడెంటిటీ కార్డు, విద్యార్హత పత్రాలు, ఇతర సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
➥ కంపెనీ నిబంధనల మేరకు ఆన్-బోర్డింగ్ సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఆన్-బోర్డింగ్ ఫారమ్‌లను పూర్తి చేయడం, ఓరియంటేషన్ సెషన్‌లకు హాజరు కావడం లేదా శిక్షణ మాడ్యూల్‌లను పూర్తి చేయడం వంటివి ఉండవచ్చు.
స్టైఫండ్ చెల్లింపు విధానం..
స్టైపెండ్ చెల్లింపుల కోసం మీ బ్యాంక్ వివరాలను ఆ సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి కంపెనీ CSR ఫండ్స్ నుంచి రూ.500, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500 నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు. పని గంటలకు అనుగుణంగా రోజువారీ షెడ్యూలును ప్రణాళిక బద్ధంగా తయారుచేసుకోవాలి.
ఐదేళ్లలో టాప్-500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ అందించే లక్ష్యంతో పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.800 కోట్ల వ్యయంతో పైలట్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించింది. పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలుచేయనున్నారు.
PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో విడత కోసం ఎలా దరఖాస్తు చేయాలి..
➥ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
➥ ‘రిజిస్టర్’పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు నమోదుచేయాలి.
➥ తర్వాత సిస్టమ్ ఓ రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంది.
➥ సెక్టార్, లొకేషన్, అర్హతల ప్రాధాన్యతలు పేర్కొంటుంది.
➥ 5 ప్రాధాన్య ఇంటర్న్‌షిప్స్‌లో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ దరఖాస్తు సమర్పించి, అప్లికేషన్‌ను పేజీని డౌన్‌లోడ్ చేయండి.