EPF Interest Rate For Financial Year 2024-25: దాదాపు 7 కోట్ల మంది మంది EPFO ఖాతాదార్ల ఎదురు చూపులు ఫలితాన్ని ఇవ్వలేదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF)పై వడ్డీ రేటు మారలేదు. వాస్తవానికి, ఈ రేటు మారకపోవచ్చని ముందు నుంచి అంచనాలు ఉన్నప్పటికీ, మోదీ 3.0 ప్రభుత్వం ఈ వేసవిలో చల్లటి వార్త చెబుతుందేమోన్న ఆశలు ఉద్యోగుల మనసుల్లో ఏదో మూల ఉన్నాయి. EPFO తాజా నిర్ణయంతో ఆ ఆశలన్నీ నీరుగారాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.25 శాతమే!
PTI రిపోర్ట్ ప్రకారం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం EPF వడ్డీ రేటును (EPF interest rate for the financial year 2024-25) 8.25 శాతంగా ఖరారు చేసింది. ఈ రోజు (శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025) జరిగిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్’ (EPFO CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు PTI రిపోర్ట్ చేసింది. నిజానికి, గత ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం కూడా 8.25 శాతం వడ్డీనే చెల్లిస్తున్నారు. అంటే, ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకుండా, యథాతథంగా ఉంచాలని CBT నిర్ణయం తీసుకుంది.
వడ్డీ రేటును ప్రతిపాదించిన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌లో కంపెనీల యజమానులు, ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వాలు & కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. EPFO CBT ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించి, చందాదారులకు జమ చేసే ముందు ఆమోదించాలి. సాధారణంగా, సంవత్సరం రెండో భాగంలో ఇది జరుగుతుంది.
EPFO, 2024 ఫిబ్రవరిలో, 2023-24 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది, ఇది 2022-23లో 8.15 శాతంగా ఉంది. 2022 మార్చిలో, 2021-22 సంవత్సరానికి EPF ఇంట్రస్ట్ రేట్‌ను నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించారు. దీంతో పోలిస్తే ప్రస్తుత రేటు కాస్త నయమే అయినప్పటికీ, పెంపు లేకపోవడంతో ఈపీఎఫ్‌వో చందాదార్లు నిరాశ చెందారు.
2023-24 కోసం ఇచ్చిన 8.25 శాతం వడ్డీ రేటును.. రూ.13 లక్షల కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్‌పై వచ్చిన రూ.1.07 లక్షల కోట్ల రాబడి ఆధారంగా నిర్ణయించారు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్ స్థాయి రాబడి. 2022-23లో రూ. 11.02 లక్షల కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్‌పై రూ. 91,151.66 కోట్ల రాబడి వచ్చింది.
ఇటీవలి కాలంలో, 2015-16 ఆర్థిక సంవత్సరంలో EPF వడ్డీ రేటు అత్యధికంగా 8.80 శాతంగా ఉంది. చరిత్రలోకి తొంగి చూస్తే, గత పదేళ్లలో EPF వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
గత పది సంవత్సరాల్లో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఇవీ..
2023-24లో —– 8.25 శాతం
2022-23లో —– 8.15 శాతం
2021-22లో —– 8.10 శాతం
2020-21లో —– 8.50 శాతం
2019-20లో —– 8.50 శాతం
2018-19లో —– 8.65 శాతం
2017-18లో —– 8.55 శాతం
2016-17లో —– 8.65 శాతం
2015-16లో —– 8.80 శాతం
2014-15లో —– 8.75 శాతం
2024-25లో, EPFO రికార్డ్ స్థాయిలో రూ. 2.05 లక్షల కోట్ల విలువైన 50.8 మిలియన్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసింది. ఇది, 2023-24లో రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 44.5 మిలియన్ క్లెయిమ్‌లుగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: జనరల్ టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కుతున్నారా? – మీకో షాకింగ్ న్యూస్